Blair Tickner : నా భార్య‌కు క్యాన్స‌ర్‌.. నా ఆలోచ‌న విధాన‌మే మారిపోయింది.. కివీస్ బౌల‌ర్ బ్లెయిర్ టిక్నర్

Blair Tickner : న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ బ్లెయిర్ టిక్నర్ తన జీవితంలో ఎదురైన కష్టమైన పరిస్థితులు తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేశాయని తెలిపాడు.

Blair Tickner talks On Wifes Cancer Battle And Its Impact On His Career

Blair Tickner : న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ బ్లెయిర్ టిక్నర్ తన జీవితంలో ఎదురైన కష్టమైన పరిస్థితులు తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేశాయని తెలిపాడు. రెండేళ్ల క్రితం తన భార్య క్యాన్సర్‌తో పోరాడిన సమయంలో ఎదురైన అనుభవాలు జీవితంపై తన దృక్పథాన్ని మార్చాయని చెప్పాడు. గతంలో ప్రదర్శనపై ఒత్తిడికి లోనయ్యేవాడినని, ఇప్పుడు మాత్రం క్రికెట్‌ను ఆస్వాదించడానికే ప్రాధాన్యత ఇస్తున్నానని వెల్లడించాడు.

టిక్నర్ 2019లో న్యూజిలాండ్ తరఫున టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 2022లో వన్డేలు, 2023లో టెస్టుల్లోనూ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అయితే వ్యక్తిగత జీవితంలో మాత్రం అతడికి కఠిన పరిస్థితులు ఎదురయ్యాయి. 2024 ఏప్రిల్‌లో అతడి భార్య సారా లుకేమియా (రక్త క్యాన్సర్) బారిన పడినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆమె ఎనిమిది నెలల పాటు చికిత్స తీసుకున్నారు. అదే ఏడాది క్రిస్మస్ ఈవ్ రోజున ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

IND vs NZ : క్రికెట్ అభిమానుల‌కు బ్యాడ్‌న్యూస్‌.. భారత్ vs న్యూజిలాండ్ రెండో వ‌న్డేకు వ‌ర్షం ముప్పు..!

ప్రస్తుతం భారత్‌తో స్వదేశంలో జరుగుతున్న వన్డే సిరీస్ కోసం ఎంపికైన న్యూజిలాండ్ జట్టులో టిక్నర్ సభ్యుడిగా ఉన్నాడు. ఇప్పటివరకు 19 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. భారత్‌తో రెండో వన్డేకు ముందు 33 ఏళ్ల టిక్నర్ తన జీవితంలో ఎదురైన అనుభవాల గురించి మాట్లాడాడు.

‘నా జీవితం ఎన్నో ఒడిదొడుకులతో సాగింది. ఈ ప్రయాణంలో సారా, నా కుటుంబం నాకు అండగా నిలవడం ఎంతో గొప్ప విషయం. ఇప్పుడు నా క్రికెట్‌ను ఆస్వాదించడానికి ప్రయత్నిస్తున్నాను. గతంతో పోలిస్తే ఇప్పుడు మరింత సహజంగా, స్వేచ్ఛగా ఆడుతున్నాను. నా కెరీర్ ప్రారంభంలో ప్రదర్శన విషయంలో చాలా ఒత్తిడికి గురయ్యేవాడిని. ఆ తర్వాత సారా క్యాన్సర్ చికిత్స సమయంలో చాలా కష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నాం.’ అని టిక్నర్ వివరించాడు.

గత రెండేళ్లలో ఎదురైన అనుభవాలు ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం ఎంత ముఖ్యమో తనకు నేర్పించాయని చెప్పాడు. ‘ఇప్పుడు నా కెరీర్ చివరి దశకు చేరుకుంటున్నాను. ఇకపై ఆటను సరదాగా ఆస్వాదించాలనుకుంటున్నాను. నా ఆటలోనూ అదే కనిపించేలా ప్రయత్నిస్తున్నాను.’ అని చెప్పాడు.

IND vs SL : విశాఖ‌లో చివ‌రిసారి ఆడ‌నున్న రోహిత్‌, కోహ్లీ.. డిసెంబ‌ర్ 13న భార‌త్ వ‌ర్సెస్ శ్రీలంక తొలి వ‌న్డే..

‘ముఖంపై చిరునవ్వుతో క్రికెట్ ఆడేందుకు ప్రయత్నిస్తాను. క్రికెట్ కంటే జీవితంలో చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఈ ఆట నాకు ఎంతో ఇచ్చింది. కానీ రోజు చివర్లో ఇంటికి వెళ్లినప్పుడు నా భార్య, కూతురు ఉంటారు. వారితో ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. అందుకే నా దృష్టిలో క్రికెట్ కంటే కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యత.’ అని టిక్నర్ చెప్పుకొచ్చాడు.