FIFA World Cup Final : ఫిఫా వరల్డ్‌కప్‌లో కొత్త సంప్రదాయం.. విజేతలకు తొలిసారి చాంపియన్‌షిప్ రింగ్స్.. వీటి ప్రత్యేక ఏమిటంటే? ఎవరికి అందజేస్తారు?

FIFA World Cup Championship Rings : ఫిఫా వరల్డ్‌కప్ చరిత్రలో తొలిసారిగా విజేత జట్టు సభ్యులకు ప్రత్యేకంగా రూపొందించిన చాంపియన్‌షిప్ రింగ్స్ అందించనున్నారు.

FIFA World Cup Championship Rings

  • నేడు ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్
  • ఫైనల్లో తలపడనున్న స్పెయిన్ వర్సెస్ అర్జెంటీనా జట్లు
  • తొలిసారి విజేతలకు చాంపియన్‌షిప్ రింగ్స్

FIFA World Cup Championship Rings : ఫిఫా ప్రపంచ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ కోసం క్రీడాభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం అర్ధరాత్రి తరువాత 12.30 గంటలకు ఫైనల్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా, స్పెయిన్ జట్లు తలపడనున్నాయి. 38 రోజులుగా పపంచాన్ని ఊపేస్తున్న మెగా టోర్నీలో ఈ రెండు మేటి జట్ల మధ్య పతాక పోరుకు రంగం సిద్ధమైంది. ఈ ఫైనల్ మ్యాచ్ లో ఎవరు విజేతగా నిలుస్తారనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

Also Read : Rohit Sharma : వార్నీ.. లార్డ్స్‌లో రోహిత్ శ‌ర్మ రికార్డు ఇంత ద‌రిద్రంగా ఉందా? ఇక అంతే సంగ‌తి..

ఫిఫా వరల్డ్‌కప్ చరిత్రలో తొలిసారిగా విజేత జట్టు సభ్యులకు ప్రత్యేకంగా రూపొందించిన చాంపియన్‌షిప్ రింగ్స్ అందించనున్నారు. అమెరికా క్రీడల్లో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని ఇప్పుడు ప్రపంచ ఫుట్‌బాల్‌లోనూ ప్రవేశపెడుతోంది ఫిఫా. దీంతో 2026 వరల్డ్‌కప్ ఫైనల్ మరో చారిత్రక ఘట్టానికి వేదిక కానుంది.

సాధారణంగా అమెరికాలో ఎన్‌ఎఫ్‌ఎల్ (NFL), ఎన్‌బీఏ (NBA), ఎంఎల్‌బీ (MLB), ఎన్‌హెచ్‌ఎల్ (NHL) వంటి ప్రముఖ ప్రొఫెషనల్ లీగ్‌లలో టైటిల్ గెలిచిన జట్లకు ప్రత్యేకంగా రూపొందించిన చాంపియన్‌షిప్ రింగ్స్‌ను అందజేయడం ఆనవాయితీ. ఇప్పుడు అదే సంప్రదాయాన్ని ఫిఫా వరల్డ్‌కప్‌లో కూడా అమలు చేయనుంది. ఈ క్రమంలో 2026 ఫిఫా వరల్డ్‌కప్ జ్ఞాపకార్థంగా మొత్తం 2,026 ప్రత్యేక రింగ్స్ తయారు చేయనున్నారు. వీటిలో 30 రింగ్స్ విజేత జట్టు ఆటగాళ్లు, కోచ్‌లు, సిబ్బందికి మాత్రమే కేటాయిస్తారు. మిగిలిన 1,996 రింగ్స్‌ను అధికారిక లైసెన్స్ ఉత్పత్తులుగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులకు విక్రయిస్తారు.

ప్రతి రింగ్ ఒక ప్రత్యేక సీరియల్ నంబర్‌తో ఉంటుంది. ఒకవైపు ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీ, మరోవైపు విజేత జట్టు గుర్తింపు చెక్కబడుతుంది. అంతేకాదు, ప్రతి ఆటగాడి వేలి పరిమాణానికి అనుగుణంగా కస్టమ్ ఫిట్ చేసి, అథెంటిసిటీ సర్టిఫికెట్ తో అందజేస్తారు. ఫైనల్ మ్యాచ్ ముగిసిన వెంటనే విజేత జట్టు కెప్టెన్, ప్రధాన కోచ్‌కు తాత్కాలిక చాంపియన్‌షిప్ రింగ్స్‌ను వేడుకల్లో అందజేస్తారు. అనంతరం ఆటగాళ్లు, సిబ్బంది కోసం ప్రత్యేకంగా తయారు చేసిన 30 రింగ్స్‌ను మరో కార్యక్రమంలో అధికారికంగా ప్రదానం చేస్తారు. ఇవి వారి వరల్డ్‌కప్ విజయానికి చిరస్థాయి గుర్తుగా నిలుస్తాయి.

2026 ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్‌లో మరో కొత్త ప్రయోగం కూడా ఉండనుంది. అమెరికా ఎన్‌ఎఫ్‌ఎల్ సూపర్‌బౌల్‌లో ఉండే తరహాలో హాఫ్‌టైమ్ షోను కూడా తొలిసారి నిర్వహించనున్నారు. దీంతో ఫుట్‌బాల్ అభిమానులకు మ్యాచ్‌తో పాటు ప్రత్యేక వినోదాన్ని కూడా అందించనున్నారు.