Chris Gayle: కోహ్లీతో ఆడిన రోజులను గుర్తు చేసుకుంటూ అతడిపై క్రిస్ గేల్ ప్రశంసల జల్లు
కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేయడం ఓ అద్భుతమైన అనుభవమని క్రిస్ గేల్ చెప్పారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న సమయంలో కోహ్లీ సహా ఇతర ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ లో డ్యాన్సులు చేస్తూ, చాలా సరదాగా గడిపేవాడినని అన్నారు.
- T Venkateshwarlu
- Published On : March 26, 2023 / 06:10 PM IST
Chris Gayle
Chris Gayle: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై వెస్టిండీస్ మాజీ ఆటగాడు క్రిస్ గేల్ ప్రశంసల జల్లు కురిపించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023 త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో క్రిస్ గేల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. గతంలో కోహ్లీతో కలిసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున తాను ఆడిన రోజులను గుర్తు చేసుకున్నారు. కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేయడం ఓ అద్భుతమైన అనుభవమని చెప్పారు.
ఆట పట్ల కోహ్లీకి ఉన్న ప్యాషన్, నైతికత అంటే తనకు చాలా ఇష్టమని క్రిస్ గేల్ అన్నారు. వాటిని తన ఆటతీరు ద్వారా కనబర్చుతాడని, ఆ క్రెడిట్ అంతా అతడికే ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న సమయంలో కోహ్లీ సహా ఇతర ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ లో డ్యాన్సులు చేస్తూ, చాలా సరదాగా గడిపేవాడినని అన్నారు.
ఓ సీజన్ లో విరాట్ కోహ్లీ వద్ద ఆరెంజ్ క్యాప్ ఉందని, అనంతరం దాన్ని తాను గెలుచుకున్నానని చెప్పారు. క్రీజులో తాను, కోహ్లీ పరుగులు తీసే సమయంలో చాలా శ్రద్ధగా అన్ని అంశాలను గమనించేవాళ్లమని తెలిపారు. తామిద్దరం పరస్పరం బాగా అవగాహనతో ఆడేవారిమని చెప్పారు. బాగా ఆడినప్పుడు ఒకరిని ఒకరు ప్రశంసించుకునేవారిమని తెలిపారు. కాగా, విరాట్ కోహ్లీ ఇప్పటికీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫునే ఆడుతున్నాడు.
Sourav Ganguly: రిషభ్ పంత్ మళ్లీ టీమిండియాలో చేరే అవకాశాలు ఉన్నాయి: గంగూలీ
