బీజేపీకి ధర్మాసనాలు వరుస షాకులిస్తున్నాయి. హైకోర్టు తీర్పుపై దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీజేపీ రథయాత్ర అనుమతి కేసులో మరోసారి చుక్కెదురయ్యింది. పశ్చిమబెంగాల్ లో బీజేపీ రథయాత్రకు అనుమతి నిరాకరిస్తూ కలకత్తా హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసుపై విచారణ అవసరం లేదనీ భావించి సాధారణ కేసుల్లాగానే దీన్ని కూడా పరిగణిస్తున్నామని చెప్పింది.
పశ్చిమబెంగాల్ లో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రథయాత్రను శాంతిభద్రతల కారణంగా అనుమతిని ఇవ్వలేమని ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ అంశంపై కలకత్తా కోర్టును బీజేపీ ఆశ్రయించింది. పిటిషన్ ను విచారించిన ఏకసభ్య ధర్మాసనం రథయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనంతరం ఈ తీర్పును డివిజన్ బెంచ్ పక్కన పెట్టేసింది. దీంతో, బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా..సుప్రీంకోర్టు ఈ పిటీషన్ ను కొట్టివేసింది.