IND vs UAE : థర్డ్ అంపైర్ ఔట్ ఇచ్చినా.. బ్యాటింగ్ కొనసాగించిన యూఏఈ బ్యాటర్.. అసలేం జరిగిందంటే?
ఆసియాకప్ 2025లో భాగంగా బుధవారం భారత్, యూఏఈ (IND vs UAE) జట్ల మధ్య దుబాయ్ వేదికగా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

Junaid Siddique plays on despite being given out by umpire during IND vs UAE
IND vs UAE : ఆసియాకప్ 2025లో భారత్ ఘనంగా బోణీకొట్టింది. ఆతిథ్య యూఏఈ(IND vs UAE)తో జరిగిన తొలి మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా.. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. యూఏఈ బ్యాటర్ జునైద్ సిద్ధిక్ ఔటైనా కూడా కాసేటి వరకు అతడు బ్యాటింగ్ కొనసాగించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అసలేం జరిగింది ?
యూఏఈ ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. టీమ్ఇండియా ఆల్‌రౌండర్ శివమ్ దూబె ఈ ఓవర్‌ను వేశాడు. అతడు ఓ షార్ట్ పిచ్ బంతిని సందించగా క్రీజు నుంచి కాస్త ముందుకు వచ్చిన జునైద్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలం అయ్యాడు. బ్యాట్‌ను మిస్సైన బంతి వికెట్ కీపర్ సంజూ శాంసన్ చేతుల్లో పడింది.
బ్యాటర్ క్రీజులో లేని విషయాన్ని గమనించిన శాంసన్ వెంటనే బంతిని వికెట్లకు పైకి వేసి బెయిల్స్ పడగొట్టాడు. బ్యాటర్ ఔట్ అంటూ ఆటగాళ్లు అప్పీల్ చేయగా ఆన్ ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ సాయం కోరాడు. రిప్లే పరిశీలించిన థర్డ్ అంపైర్.. బెయిల్స్ పడే సమయంలో బ్యాటర్ క్రీజులో లేడని ఔట్ అని బిగ్ స్ర్కీన్ పై ప్రకటించాడు.
IND vs PAK : భారత్, పాక్ మ్యాచ్ రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టులో పిల్..!
𝙎𝙋𝙄𝙍𝙄𝙏. 𝙊𝙁. 𝙏𝙃𝙀. 𝙂𝘼𝙈𝙀 🏏
Captain SKY is all class 👏
Watch #DPWORLDASIACUP2025 – LIVE on #SonyLIV & #SonySportsNetwork TV Channels 📺#AsiaCup #INDvUAE pic.twitter.com/SjkL6iS4YM
— Sony LIV (@SonyLIV) September 10, 2025
కాగా.. అదే సమయంలో నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న ఫీల్డ్ అంపైర్‌తో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఏదో చర్చిస్తూ కనిపించాడు. కొంత సమయం తరువాత భారత జట్టు తన అప్పీల్‌ను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. దీంతో జునైద్ మళ్లీ బ్యాటింగ్ కొనసాగించాడు.
భారత్ అప్పీల్‌ను ఎందుకు ఉపసంహరించుకుందంటే?
దూబె బౌలింగ్ వేసేందుకు రన్నప్ చేస్తున్న సమయంలో అతడి నడుము వద్ద ఉంచుకున్న టవల్ జారి పోయింది. ఇది జునైద్ సిద్ధిక్ గమనించాడు. ఈ విషయాన్ని బాల్ ఆడిన తరువాత బౌలర్‌కు చెప్పాడు. ఈ విషయం టీవీ కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది. ఈ కారణంగానే జునైద్ సిద్ధిక్ క్రీజులో లేడు. అందుకనే భారత జట్టు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ అప్పీల్ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.
అయితే.. తనకు లభించిన అవకాశాన్ని జునైద్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అదే ఓవర్‌లో మరో రెండు బంతులకే అతడు ఔట్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారగా నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.