AP Fee Reimbursement : విద్యార్థులకు భారీ శుభవార్త.. రూ.258 కోట్లు విడుదల.. నేరుగా వారి ఖాతాల్లోనే జమ
AP Fee Reimbursement : ఏపీలోని కూటమి సర్కార్ విద్యార్థులకు శుభవార్త చెప్పింది.
andhra pradesh government releases rs 258 cr fee reimbursement pending funds into colleges accounts
- ఏపీ విద్యార్థులకు శుభవార్త
- ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల
- కాలేజీల ఖాతాల్లో రూ.258 కోట్లు
AP Fee Reimbursement : ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. వారి కోసం రూ.258 కోట్లు విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇంతకు ఈ మొత్తం దేనికి సంబంధించిన నిధులు అంటే.. 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు. ఈ నిధులను నేరుగా ఆయా కాలేజీ బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయనుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ విధానంలో అనేక మార్పులు చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసేవారు. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మాత్రం విద్యాసంస్థల ఆర్థిక నిర్వహణను సులభతరం చేసేందుకు గాను నేరుగా కాలేజీల అకౌంట్లలోనే ఈ నిధులను జమ చేసేందుకు నిర్ణయించింది. ఈ విద్యాసంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమలు చేస్తుంది.
గత బకాయిలతో కలిపి రాష్ట్రంలో మొత్తం రూ. 4,000 కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు పెండింగ్ ఉండగా.. కూటమి ప్రభుత్వం వాటిని విడతల వారీగా చెల్లించాలని నిర్ణయించింది. దీని గురించి ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పటికే ప్రకటించారు. దీనిలో భాగంగానే ఈ ఏడాది ఫిబ్రవరిలో బడ్జెట్ విడుదల ఉత్తర్వుల (BROs) ద్వారా ప్రభుత్వం ఒకేసారి దాదాపు రూ. 1,200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేసి విద్యార్థులకు, కాలేజీ యాజమాన్యాలకు భారీ ఊరట కలిగించింది. తాజాగా విడుదల చేసిన రూ. 258 కోట్లు కూడా బీసీ, ఈడబ్ల్యూఎస్, మైనారిటీ సంక్షేమ శాఖల పరిధిలోని విద్యార్థుల ఫీజుల కోసమేనని అధికారులు స్పష్టం చేశారు.
*ఏపీ ప్రభుత్వం శుభవార్త.. జూన్ 12 నుంచి వారి ఖాతాలో ప్రతి నెలా రూ.4 వేలు
ఈ నిధుల విడుదలతో గత కొన్నాళ్లుగా ఫీజులు బకాయి ఉండటంతో.. చాలా కాలేజీలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఆపేస్తున్నాయి. దీని వల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ తాజాగా సర్కార్ నిధులు విడుదల చేయడంతో వారికి ఊరట లభించనుంది.
ఇదిలా ఉంటే ఏపీలో.. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు సకాలంలో అకౌంట్లలో పడాలంటే విద్యార్థులు కచ్చితంగా 75 శాతం బయోమెట్రిక్ అటెండెన్స్ కలిగి ఉండాలి. అలానే జ్ఞానభూమి పోర్టల్లో ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు. అర్హులైన ప్రతి విద్యార్థి చదువుకు ప్రభుత్వం అండగా ఉంటుందని, బకాయిలన్నింటినీ త్వరలోనే పూర్తిగా చెల్లిస్తామని ప్రభుత్వం వెల్లడించింది.
