Durga Temple Ghat Road : దుర్గ గుడికి వెళ్లే భక్తులకు అలర్ట్.. ఆ ఘాట్ రోడ్డు నేటి నుంచి మూసివేత 15 రోజుల పాటు..!
Durga Temple Ghat Road : విజయవాడ దుర్గ గుడికి వెళ్లే భక్తులకు అలర్ట్..
vijayawada Durga Temple Ghat Road To Be Closure For few days May 28 Devotees To Use Alternative Routes
- దుర్గ గుడికి వెళ్లే భక్తులకు అలర్ట్
- 15 రోజుల పాటు ఘాట్ రోడ్డు మూసివేత
- చంటి బిడ్డల తల్లులు, వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే లిఫ్ట్
Durga Temple Ghat Road : ఇంద్రకీలాద్రిలో కొలువైన కనక దుర్గమ్మ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్లే భక్తులకు కీలక అలర్ట్. ఘాట్ రోడ్డును 15 రోజుల పాటు మూసివేస్తున్నట్లు దుర్గమల్లేశ్వర స్వామి దేవస్థానం ఈవో ప్రకటించారు. ఘాట్ రోడ్ మరమ్మతు పనులు నేటి నుంచి అనగా మే 28వ తేదీ గురువారం నుండి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో, భక్తుల భద్రత దృష్ట్యా ఘాట్ రోడ్ దిశగా వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు దుర్గగుడి ఆలయ ఈవో తెలిపారు. ఘాట్ రోడ్డు మూసివేయడంతో.. ఇందుకు ప్రత్యామ్నాయంగా.. భక్తుల కోసం కనకదుర్గ నగర్ వైపు నుండి రాకపోకలు సాగించేలా ఏర్పాటు చేసినట్లు దుర్గగుడి ఈవో తెలిపారు.
ఈ క్రమంలో బుధవారం ఈవో ఆధ్వర్యంలో.. ఘాట్ రోడ్ మూసివేత, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలతో పాటు తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు నిర్ణయాలు తీసుకున్నారు.
- ప్రస్తుతం ఘాట్ రోడ్డులో ఉన్న ప్రోటోకాల్ ఆఫీస్‌ను వెంటనే కొండ దిగువన కనకదుర్గ నగర్లో నూతనంగా నిర్మించిన భవనంలోకి మార్చారు.
- కొత్త ప్రోటోకాల్ ఆఫీస్ దగ్గర భక్తుల రవాణా కోసం సరిపడా బ్యాటరీ వాహనాలను నిరంతరం అందుబాటులో ఉంచుతారు.
- భక్తుల రద్దీని నియంత్రించేందుకు గాను ఘాట్ రోడ్లో ఉన్న టికెట్ కౌంటర్ సిబ్బందిని.. కొత్త ప్రోటోకాల్ ఆఫీస్ వద్దకు తరలించారు.
- కొత్త ప్రోటోకాల్ ఆఫీస్ నుండి మహా మండపం వరకు అదనంగా సెక్యూరిటీ గార్డులను, సూపర్వైజర్లను విధుల్లో నియమించారు.
- ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే భక్తుల దర్శనాల కోసం గాను మహా మండపం దగ్గర ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రత్యేక పాయింట్లను ఏర్పాటు చేశారు.
- నిత్య పూజలు, సేవల కొరకు కొండపైకి వచ్చే భక్తులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఘాట్ రోడ్ మూసివేత, ప్రత్యామ్నాయ మార్గాల గురించి భక్తులకు తెలియజేయడం కోసం.. ఆలయ పరిసరాల్లో మైక్ ద్వారా నిరంతరం ప్రచారం చేయనున్నారు. మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా గల ప్రదేశంలో వాహనాల పార్కింగ్‌కు సీతమ్మవారి పాదాలు నుండి, కుమ్మరి పాలెం సెంటర్ నుండి, పున్నమి ఘాట్ నుండి నిరంతరం దేవస్థానం బస్సులు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు.
