Riyan Parag : మేం 260 పరుగులు చేయాల్సింది.. కానీ.. రియాన్ పరాగ్ కామెంట్స్..
తమ జట్టు గెలుపుపై రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ (Riyan Parag) ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
IPL 2026 Riyan Parag Comments after RR beat SRH in Eliminator (pic credit@ipl)
- సన్‌రైజర్స్ పై విజయం
- క్వాలిఫయర్-2కి అర్హత సాధించిన రాజస్థాన్
- కెప్టెన్ రియాన్ పరాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Riyan Parag : ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ క్వాలిపయర్-2కి అర్హత సాధించింది. బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 47 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక శుక్రవారం (మే 29న) జరగనున్న క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో గుజరాత్‌తో రాజస్థాన్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన వారు ఆదివారం (మే 31న) జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీతో కప్పు కోసం పోటీపడనున్నారు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. ఆర్ఆర్ బ్యాటర్లలో వైభవ్ సూర్యవంశీ (97; 29 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్సర్లు), ధ్రువ్ జురెల్ (50; 21 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) లు దంచికొట్టారు. సన్‌రైజర్స్ బౌలర్లలో ప్రఫుల్ హింజ్ మూడు, ఇషాన్ మలింగ, శివంగ్ కుమార్, నితీశ్ కుమార్ రెడ్డి లు తలా ఓ వికెట్ సాధించారు.
అనంతరం 244 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ 19.2 ఓవర్లలో 196 పరుగులకే ఆలౌటైంది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో నితీశ్‌కుమార్ రెడ్డి (38), సలీల్ అరోరా (35), ఇషాన్ కిషన్ (33) లు పర్వాలేదనిపించారు. ఆర్ఆర్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ మూడు, నాంద్రే బర్గర్, సుశాంత్ మిశ్రా, రవీంద్ర జడేజాలు తలా రెండు వికెట్లు పడగొట్టారు. యశ్ రాజ్ పుంజా ఓ వికెట్ తీశాడు.
ఇక మ్యాచ్ అనంతరం తమ జట్టు గెలుపుపై రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అదే సమయంలో తమ జట్టు బ్యాటింగ్‌లో ఇంకాస్త మెరుగైన ప్రదర్శన చేసి ఉంటే బాగుండేదన్నాడు. తాను ప్రతి విషయంలో ఫర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటానని అన్నాడు. ఇక సన్‌రైజర్స్ పై తాము 260 పరుగు చేయాల్సిందన్నాడు. వైభవ్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చిన తరువాత ఆ మాత్రం స్కోరు సాధించాల్సి ఉందని చెప్పుకొచ్చాడు. తప్పకుండా దానిపై దృష్టి సారించాలన్నాడు.
ఇక బౌలింగ్‌లో తాము అద్భుతంగా రాణించామన్నాడు. తొలి మూడు ఓవర్లలోనే సన్‌రైజర్స్ స్కోరు హాప్ సెంచరి దాటేసిందన్నాడు. దూకుడుగా ఆడుతున్న ఇషాన్, ట్రావిస్లను ఔట్ చేసి తాము రేసులోకి వచ్చామన్నాడు. ఇక వైభవ్ సూర్యవంశీతో ఎలాంటి సంభాషణలు చేస్తారని ప్రశ్నించగా.. వైభవ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు లేదా మ్యాచ్‌కు ముందు కూడా అతడితో తాము పెద్దగా మాట్లాడమన్నాడు. అతడికి ఇలా ఆడు, అలా ఆడు అనే విషయాలను చెప్పమని తెలిపాడు. అతడిని ఒంటరిగా వదిలేస్తామన్నాడు. అతడికి బ్యాటింగ్ అంటే చాలా ఇష్టం అని, దానిని ఆస్వాదించమని మాత్రమే చెబుతామన్నాడు.
ఈ సీజన్లో ప్రతి మ్యాచ్‌లోనూ విజయం కోసం శ్రమించామని, నాకౌట్‌కు చేరుకునేందుకు లీగ్ స్టేజ్‌లోని ఆఖరి రెండు మ్యాచ్‌లు కీలకంగా మారాయన్నాడు. అలా అని మిగిలిన మ్యాచ్‌ల్లోనూ రాణించామన్నాడు. ప్రస్తుతం తమ దూకుడులో కాస్త మార్పు వచ్చిందనేది మాత్రం వాస్తవం అని చెప్పాడు.
ఆర్చర్‌కు ఏం చెబుతారు?
ప్రపంచంలోనే అత్యుత్తమ పేసర్లలో జోఫ్రా ఆర్చర్ ఒకడని అన్నాడు. అతడికి ఎలా బౌలింగ్ చేయాలి అనే విషయాన్ని ఎవరైనా చెప్పగలరా అని ప్రశ్నించాడు. అయితే.. ఆర్చర్‌తో తన సంభాషణ చాలా సరదాగా ఉంటుందన్నాడు. ఇద్దరం ఒకరిని ఒకరం ఆట పట్టించుకుంటామన్నాడు. 150 కి.మీ వేగంతో బౌలింగ్ చేసే బౌలర్‌ను స్లో గా వేయమని చెప్పలేమన్నాడు. ఇక క్వాలిఫయర్-2 మ్యాచ్‌కు ముందు కాస్త విశ్రాంతి తీసుకుంటామని చెప్పాడు. గుజరాత్‌తో మ్యాచ్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లుగా తెలిపాడు.
