IND vs PAK : భారత్, పాక్ మ్యాచ్ రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టులో పిల్..!
ఆసియాకప్2025లో జరగనున్న భారత్ వర్సెస్ పాక్ (IND vs PAK ) మ్యాచ్‌ను రద్దు చేయాలని సుప్రీం కోర్టులో పిల్ దాఖలైంది.

PIL in Supreme Court seeks cancellation of IND vs PAK match in Asia Cup 2025
IND vs PAK : ఆసియాకప్ 2025 టోర్నమెంట్‌లో భాగంగా సెప్టెంబర్ 14న జరగాల్సిన భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్) దాఖలైంది. ఈ మ్యాచ్ (IND vs PAK ) జాతీయ ప్రయోజనాలకు విరుద్ధమని, అమరవీరుల త్యాగాలను అవమాన పరుస్తుందంటూ పిటిషనర్లు అందులో పేర్కొన్నారు.
ఆంగ్లమీడియాలో వస్తున్న వార్తల ప్రకారం నలుగురు న్యాయ విద్యార్థులు ఈ పిల్‌ను దాఖలు చేశారు. అందులో పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ విషయాలను ప్రస్తావించారు. పాక్‌లో క్రికెట్ మ్యాచ్‌లు ఆడడం అమరవీరుల కుటుంబాలను అవమానించడమేనని తెలిపారు. సైనికులు దేశం కోసం ప్రాణ త్యాగాలను చేస్తుంటే.. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న దేశంతో క్రికెట్ ఆడడం తప్పు అని, వినోదం కంటే దేశం యొక్క గౌరవం, పౌరుల భద్రత ముఖ్యం. అని పిటిషన్‌లో పేర్కొన్నారు.
బీసీసీఐను కూడా పిటిషనర్లు ఓ పార్టీగా చేర్చారు. యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ పరిధిలోకి బీసీసీఐని తీసుకురావాలని కోరారు. జాతీయ క్రీడా పాలన చట్టం 2025 అమలులోకి వచ్చిన తర్వాత బీసీసీఐ తప్పనిసరిగా చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడిన జాతీయ క్రీడా బోర్డు పరిధిలోకి వస్తుందని వివరించారు. అడ్వకేట్ ఆన్ రికార్డ్ అన్సార్ అహ్మద్ చౌదరి ద్వారా ఈ పిల్ దాఖలు చేయబడింది.
ఘనంగా బోణీ కొట్టి భారత్..
ఇదిలా ఉంటే.. ఆసియాకప్ 2025 తొలి మ్యాచ్‌లో భారత్ ఘనంగా బోణీ కొట్టింది. బుధవారం దుబాయ్ వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ 13.1 ఓవర్లలో 57 పరుగులకే ఆలౌటైంది. యూఏఈ బ్యాటర్లలో ఓపెనర్లు అలిషన్ షరాఫు (22), మహ్మద్ వసీమ్ (19) లు మాత్రమే రెండు అంకెల స్కోరు సాధించారు. మిగిలిన వారు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీయగా, శివమ్ దూబె మూడు వికెట్లు సాధించాడు.
ఆ తరువాత 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 4.3 ఓవర్లలో ఓ వికెట్ కోల్పోయి అందుకుంది. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ (16 బంతుల్లో 30 పరుగులు), శుభ్‌మన్ గిల్ (9 బంతుల్లో 20 నాటౌట్)లు వేగంగా ఆడారు.