DCvsRR: ఢిల్లీ టార్గెట్ 116

మరో సారి రియాన్ పరాగ్ రెచ్చిపోయాడు. రాజస్థాన్ రాయల్స్ పేలవమైన ఇన్నింగ్స్‌కు పరాగ్ హాఫ్ సెంచరీ చెప్పుకోదగ్గ స్కోరును ఇచ్చింది. ఈ క్రమంలో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 9వికెట్లు నష్టపోయి ఢిల్లీకి 116పరుగుల టార్గెట్ నిర్దేశించింది. 

మ్యాచ్ ఆసాంతం పేలవమైన స్కోరుతో తేలిపోతున్న వేళ.. స్వల్ప విరామంతో వికెట్లు కుప్పకూలుతున్న సమయంలో 17ఏళ్ల రియాన్ పరాగ్ హాఫ్ సెంచరీ జట్టు 115పరుగుల స్కోరు చేసేందుకు దోహదపడింది. ఓపెనర్లు అజింకా రహానె(2), లియాం లివింగ్‌స్టోన్(14)ల దారిలోనే నడిచి సంజూ శాంసన్(5), మహిపాల్ లామ్రర్(8), శ్రేయాస్ గోపాల్(12) పెవిలియన్ బాటపట్టారు. 

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రియాన్ పరాగ్(50; 49బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సులు) చివరి బంతికి భారీ షాట్‌కు యత్నించి అవుట్ అయ్యాడు. మరో ఎండ్‌లో దిగిన స్టువర్ట్ బిన్నీ(0), కృష్ణప్ప గౌతం(6), ఇష్ సౌదీ(6), వరుణ్ ఆరోన్(3)లు ఢిల్లీ బౌలర్ల ధాటికి కుప్పకూలిపోయారు. ఢిల్లీ బౌలర్లు ట్రెంట్ బౌల్ట్(2), ఇషాంత్ శర్మ(3), అమిత్ మిశ్రా(3)వికెట్లు పడగొట్టారు.