ENG-w vs IND-w : భారత మహిళల శుభారంభం.. తొలి టీ20లో ఇంగ్లాండ్ పై ఘన విజయం
ఇంగ్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత మహిళలు (ENG-w vs IND-w) శుభారంభం చేశారు.
- Thota Vamshi Kumar
- Published on- May 29, 2026 / 11:18 AM IST
ENG-w vs IND-w India Women win first 1t20 match against england women
- తొలి టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పై భారత మహిళల గెలుపు
- మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి
ENG-w vs IND-w : ఇంగ్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత మహిళలు శుభారంభం చేశారు. చెమ్స్‌ఫోర్డ్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మహిళల జట్టు పై భారత మహిళల జట్టు 38 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. టీమ్ఇండియా ప్లేయర్లలో జెమీమా రోడ్రిగ్స్ (69; 40 బంతుల్లో 10 ఫోర్లు, ఓ సిక్స్), యాస్తికా భాటియా (54; 40 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలు చేశారు. దీప్తి శర్మ (22; 13 బంతుల్లో 4 ఫోర్లు) రాణించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో లారెన్ బెల్ మూడు వికెట్లు తీసింది. ఇస్సీ వాంగ్, టిల్లీ కోర్టీన్-కోల్‌మన్, షార్లెట్ డీన్ తలా ఓ వికెట్ తీశారు.
ఆ తరువాత 189 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 150 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో అమీ జోన్స్ (67; 48 బంతుల్లో 9 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేసింది. భారత బౌలర్లలో నందని శర్మ మూడు వికెట్లు తీసింది. క్రాంతి గౌడ్ రెండు వికెట్లు పడగొట్టింది. శ్రీ చరణి, దీప్తి శర్మ ఒక్కొ వికెట్ సాధించారు.
ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ శనివారం (మే 30) బ్రిస్టల్ వేదికగా జరగనుంది.
