టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన జేమ్స్ ఆండర్సన్

అరంగేట్రం చేసిన లార్డ్స్‌ మైదానంలోనే తన చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడనున్నట్టు ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్ల‌డించాడు.

James Anderson announces retirement from Test cricket (Photo Source: @jimmy9)

James Anderson : ఇంగ్లండ్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వచ్చే వేసవిలో వెస్టిండీస్‌తో జరిగే మూడు గేమ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ తర్వాత టెస్ట్ క్రికెట్‌ నుంచి వైదొలగనున్నట్టు శనివారం ప్రకటించాడు. ఈ మ్యాచ్ జూలై 10న జరగనుంది. అరంగేట్రం చేసిన లార్డ్స్‌ మైదానంలోనే తన చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడనున్నట్టు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్ల‌డించాడు.

“అందరికీ హాయ్. వేసవిలో లార్డ్స్‌లో జరిగే మొదటి టెస్టు నా చివరి టెస్టు. నా చిన్నప్పటి నుంచి నేను ఇష్టపడే ఆటను ఆడుతూ, నా దేశానికి 20 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించడం నిజంగా అద్భుతం. నేను ఇంగ్లండ్‌ క్రికెట్ టీమ్ ను ఇక నుంచి చాలా మిస్ అవుతాను. నేను పక్కకు తప్పుకుని ఇతరులకు దారిచ్చే సమయం ఆసన్నమైందని నాకు తెలుసు. నాకులాగే ఇతరులు కూడా వారి కలలను సాకారం చేసుకోవాలి. ఎందుకంటే ఇంత కంటే గొప్ప అనుభూతి ఉండద”ని ఆండర్సన్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో రాశారు. తన కుటుంబ సభ్యుల ప్రేమ, అండదండలతోనే తాను ఎంతో సాధించానని చెప్పాడు. తన సహచర ఆటగాళ్లకు, కోచ్ లతో పాటు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత గోల్ఫ్ ఆడతానని తెలిపాడు.

21 ఏళ్ల పాటు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన 41 ఏళ్ల ఆండర్సన్ 187 టెస్టులు ఆడి 700 వికెట్లు పడగొట్టాడు. 2003లో ప్రఖ్యాత లార్డ్స్‌ మైదానంలో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన ఆండర్సన్ తర్వాత కాలంలో ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ లో ప్రధాన బౌలర్ గా మారాడు.

Also Read: కీలక మ్యాచ్ ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎదురుదెబ్బ.. ఒక్క మ్యాచ్‌కు దూరంగా కెప్టెన్ రిషబ్ పంత్‌