కీలక మ్యాచ్ ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎదురుదెబ్బ.. ఒక మ్యాచ్‌కు దూరంగా కెప్టెన్ రిషబ్ పంత్
Rishabh Pant: ఢిల్లీ జట్టులోని మిగతా సభ్యులకూ జరిమానా పడింది. వారికి రూ.12 లక్షల చొప్పున లేదంటే..

Rishabh Pant
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. అతడు ఒక మ్యాచ్ ఆడకుండా సస్పెండ్ చేసినట్లు బీసీసీఐ ఇవాళ మధ్యాహ్నం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఢిల్లీ క్యాపిటల్స్ కీలక మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ సమయంలో రిషబ్ పంత్ ఆడకుండా ఒక మ్యాచ్ నిషేధం పడడం గమనార్హం.
ఎందుకీ నిషేధం?
ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ మూడు సార్లు స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ జట్టు కెప్టెన్ పంత్ పై మ్యాచ్ నిషేధంతో పాటు బీసీసీసీ రూ.30 లక్షల జరిమానా విధించింది.
పంత్ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని బీసీసీఐ చెప్పింది. 2024 మే 07న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచులో స్లో ఓవర్ రేట్ నమోదైందని వివరించింది. ఢిల్లీ జట్టులోని మిగతా సభ్యులకూ జరిమానా పడింది. వారికి రూ.12 లక్షల చొప్పున లేదంటే మ్యాచు ఫీజులో 50 శాతం కోత విధిస్తున్నట్లు తెలిపింది.
కాగా, గతంలోనూ రెండుసార్లు పంత్ కు జరిమానా పడింది. గత నెల 4న వైజాగ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆ తర్వాత అదే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్లో ఓవర్ రేట్ నమోదుచేసింది.
ఒకే సీజన్ లో మూడు సార్లు పంత్ జరిమానా కడుతుండడం గమనార్హం. ఢిల్లీ జట్టు శనివారం వరకు 12 మ్యాచ్‌లు ఆడింది. 6 మ్యాచుల్లో గెలిచి, 12 పాయింట్లతో టేబుల్ లో ఐదో స్థానంలో ఉంది. తదుపరి రెండు మ్యాచుల్లో ఢిల్లీ జట్టు గెలవకపోతే ఐపీఎల్ నుంచి వైదొలుగుతుంది.
Also Read: సీఎస్కేపై విజయం తరువాత శుభ్‌మాన్ గిల్, టీం సభ్యులకు బిగ్ షాక్ ఇచ్చిన ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ