Fatima Sana : ఆ తప్పు వల్లే ఓడిపోయాం.. లేదంటేనా.. పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా కామెంట్లు..
టీమ్ఇండియా చేతిలో ఘోరంగా ఓడిపోవడంపై పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా (Fatima Sana) తీవ్ర నిరాశను వ్యక్తం చేసింది.
- Thota Vamshi Kumar
- Updated on- June 15, 2026 / 07:50 AM IST
Fatima Sana comments after Pakistan lost match to Team India in Womens T20 World Cup 2026
- మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో పాక్ పేలవ ప్రదర్శన
- భారత్ చేతితో చిత్తు చిత్తుగా ఓటమి
- తీవ్ర నిరాశను వ్యక్తం చేసిన పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా
Fatima Sana : మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్ పేలవ ప్రదర్శన చేసింది. చిరకాల ప్రత్యర్థి భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 64 పరుగుల భారీ తేడాతో చిత్తు చిత్తుగా ఓడిపోయింది. టీమ్ఇండియా చేతిలో ఘోరంగా ఓడిపోవడంపై పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా తీవ్ర నిరాశను వ్యక్తం చేసింది. బ్యాటింగ్ వైఫల్యంతో పాటు ఫీల్డింగ్‌లో క్యాచ్‌లు మిస్ చేయడం తమ కొంపముంచాయని పేర్కొంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో స్మృతి మంధాన (68; 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు) హాప్ సెంచరీ చేసింది. హర్మన్ ప్రీత్ కౌర్ (36; 35 బంతుల్లో 4 ఫోర్లు) రాణించింది. ఆఖరిలో రిచా ఘోష్ (34; 17 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడింది. పాకిస్థాన్ బౌలర్లలో సాదియా ఇక్బాల్, ఫాతిమా సనా లు చెరో రెండు వికెట్లు తీశారు. తస్మియా రుబాబ్, రామీన్ షమీమ్ లు చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు 17 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది. పాక్ బ్యాటర్లలో మునీబా అలీ (41; 35 బంతుల్లో 5 ఫోర్లు) రాణించింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 5 వికెట్లతో పాక్ పతనాన్ని శాసించింది. శ్రీచరణి మూడు వికెట్లు తీయగా.. షషాలీ వర్మ ఓ వికెట్ సాధించింది.
స్లో ఓవర్ రేటు పెనాల్టీ కొంపముంచింది..
మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమిపై పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా స్పందించింది. తమ జట్టు బ్యాటింగ్ ప్రదర్శన తీవ్రంగా నిరాశ పరిచిందని తెలిపింది. ఈ మెగాటోర్నీలో ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని తెలిపింది. కాబట్టి రాబోయే మ్యాచ్‌ల్లో తమ జట్టు బ్యాటర్లు ఖచ్చితంగా బాధ్యత తీసుకుని ఆడాల్సి ఉందని సూచించింది.
భారత ఇన్నింగ్స్ తొలి 15 ఓవర్ల వరకు తాము బాగానే ఆడామని చెప్పుకొచ్చింది. అనుకున్న విధంగానే బౌలింగ్, ఫీల్డింగ్ సాగిందని తెలిపింది. అయితే.. చివరి 5 ఓవర్లలో తాము ఒత్తిడిని కొనసాగించడంలో విఫలం అయ్యామని అంది. భారీగా పరుగులు సమర్పించుకున్నామని తెలిపింది. స్లో ఓవర్ రేటు పెనాల్టీ కారణంగా అదనంగా సర్కిల్‌లో ఓ ఫీల్డర్‌ను తీసుకురావడం కూడా తమ కొంపముంచిందన్నారు. ఇక ముందు ఇలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా ఉండేందుకు ప్రయత్నిస్తామని తెలిపింది.
తమకు స్లో ఓవర్ రేటు పెనాల్టీ పడడానికి భారత జట్టు లెఫ్ట్ -రైట్ కాంబినేషన్ కూడా ఓ కారణం కావొచ్చునని అభిప్రాయపడింది. ఇక తమది యువ జట్టు అని, ఇలాంటి మ్యాచ్‌ల ద్వారా వారు అనుభవాన్ని సంపాదిస్తారని వెల్లడించింది. ఇక తమ ఫీల్డర్లు క్యాచ్‌లు వదిలి వేయడంపై మాట్లాడుతూ.. నిజం చెప్పాలంటే క్యాచ్‌లే మ్యాచ్‌లను గెలిపిస్తాయి. దురదృష్టవశాత్తు మేము క్యాచ్‌లను జారవిడిచాము. సీనియర్ ప్లేయర్లుగా మేము అదే తప్పులను చేశాము. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలాంటి చిన్న తప్పుల కారణంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అని ఫాతిమా సనా అంది.
ఇక తదుపరి మ్యాచ్‌ల్లో మా బౌలింగ్, ఫీల్డింగ్‌లను రెండింటినీ మెరుగుపరచుకోవాలని భావిస్తున్నాను, ఎందుకంటే ఫీల్డింగ్‌లో చేసే పొరపాట్లు మొత్తం మ్యాచ్‌ను కోల్పోయేలా చేస్తాయని అంది. ఇక ఈ మ్యాచ్‌ల్లో తాము అనుకున్న ప్రణాళికలను చాలా చక్కగా అమలు చేశామని అంది. బ్యాటింగ్, బౌలింగ్ పవర్ ప్లేలోనే తాము గొప్పగా రాణించామని అంది. అయితే.. పవర్ ప్లే తరువాత బ్యాటింగ్‌లో వరుసగా వికెట్లు కోల్పోవడం తమ కొంపముంచాయని అంది. ఇక రానున్న మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తామని పాకిస్థాన్ కెప్టెన్ పాతిమా సనా తెలిపింది.
