Cricket vs Football : క్రికెట్‌కు అందనంత ఎత్తులో ఫుట్‌బాల్.. ప్రైజ్‌మనీలో భారీ అంతరం.. నక్కకు నాగలోకానికి ఉన్న తేడా!
ఫిఫా ప్రపంచకప్ 2026 విజేతకు ఇచ్చే ప్రైజ్‌మనీతో పోలిస్తే ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 విజేతకు ఇచ్చిన ప్రైజ్‌మనీలో (Cricket vs Football ) భారీ వ్యత్యాసం ఉంది.
- Thota Vamshi Kumar
- Updated on- June 10, 2026 / 02:57 PM IST
FIFA World Cup 2026 vs ICC T20 World Cup 2026 Prize Money details
Cricket vs Football : ఫుట్‌బాల్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మక టోర్నీ అయిన ఫిఫా ప్రపంచకప్ 2026 కు అంతా సిద్ధమైంది. రేపటి (జూన్ 11) నుంచి ఈ మెగాటోర్నీ ప్రారంభం కానుంది. మూడు దేశాలు (అమెరికా, కెనడా, మెక్సికో) ఆతిథ్యం ఇస్తుండగా మొత్తంగా 48 జట్లు పోటీపడనున్నాయి. 16 స్టేడియాల్లో 39 రోజుల పాటు 104 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలోనే ఇదే అతి పెద్ద టోర్నమెంట్‌గా ఈ టోర్నీ రికార్డుకు ఎక్కనుంది.
ఇక టోర్నీని ఫిఫా సంస్థ నిర్వహిస్తోంది. 1998 తర్వాత తొలిసారిగా జట్ల సంఖ్యను పెంచిన ఫిఫా.. ఈసారి బహుమతి మొత్తాన్ని కూడా భారీగా పెంచింది. మొత్తం 48 జట్ల మధ్య పంపిణీ చేయనున్న ప్రైజ్‌మనీ 655 మిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో 6,250 కోట్లకు పైనే). ఇది గత ఫిఫా ప్రపంచకప్‌తో పోలిస్తే దాదాపు 50 శాతం అధికం కావడం విశేషం.
ఫిఫా ప్రకటించిన వివరాల ప్రకారం.. 2026 ప్రపంచకప్‌లో నిలిచే జట్టుకు 50 మిలియన్ డాలర్లు అందజేయనున్నారు. అంటే భారత కరెన్సీలో సుమారుగా 476 కోట్లు. ఇక రన్నరప్‌కు 33 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 314 కోట్లు) మూడో స్థానంలో నిలిచే జట్టుకు 29 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు 276 కోట్లు ), నాలుగో స్థానంలో నిలిచే జట్టుకు 27 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 257 కోట్లు ) లభిస్తాయి.
క్వార్టర్‌ఫైనల్స్ చేరిన జట్లకు 19 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు 181 కోట్లు), ప్రీక్వార్టర్స్‌కు చేరిన జట్లకు 15 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు 142 కోట్లు) అందుతాయి. గ్రూప్ దశ దాటలేకపోయిన జట్లకు కూడా కనీసం 9 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు 85 కోట్లు ) ఇవ్వనున్నారు. అదనంగా ప్రపంచకప్‌కు అర్హత సాధించిన ప్రతి జట్టుకు సన్నాహక ఖర్చుల కోసం 1.5 మిలియన్ డాలర్లు ప్రత్యేకంగా అందజేస్తారు.
మొత్తంగా ఫిఫా ప్రపంచ కప్ 2026 కోసం 727 మిలియన్ డాలర్లను ఫిఫా కౌన్సిల్ ఆమోదించింది. విజేతల ప్రైజ్‌మనీ, క్రీడల నిర్వహణలతో పాటు అవార్డు మొత్తం ఇందులో కలిపి ఉంటుంది.
క్రికెట్‌లో ఎంతంటే?
ఇటీవల జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026కు మొత్తం ప్రైజ్‌మనీ 11.25 మిలియన్ డాలర్లు (అంటే భారత కరెన్సీలో సుమారు 107 కోట్లు)గా ఉంది. విజేతగా నిలిచిన భారత్‌కు విజేతగా 2.63 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు 25 కోట్లు)మాత్రమే లభించాయి. రన్నరప్ న్యూజిలాండ్ 1.42 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు 13.53 కోట్లు) అందుకోగా, మూడో స్థానంలో నిలిచిన దక్షిణాఫ్రికాకు 1 మిలియన్ డాలర్లకు పైగా ప్రైజ్‌మనీ దక్కింది.
ఓసారి రెండింటిని (ఫుట్‌బాల్, క్రికెట్) నిశితంగా గమనిస్తే.. ఫిఫా ప్రపంచకప్‌లో విజేతగా నిలవనున్న జట్టు టీ20 ప్రపంచకప్ 2026లో విజేతగా నిలిచిన భారత జట్టు కంటే దాదాపు 19 రెట్ల ఎక్కువ ప్రైజ్‌మనీగా అందుకోనుంది. అదే సమయంలో ఫిఫా ప్రపంచకప్ 2026లో ఆఖరి స్థానంలో నిలిచే జట్టుకు కూడా కనీసం 10.5 మిలియన్ డాలర్లు (ప్రైజ్‌మనీగా 9 మిలియన్ డాలర్లు+సన్నాహక ఖర్చుల కింద 1.5 మిలియన్ డార్లు) అంటే భారత కరెన్సీలో 100 కోట్ల మొత్తాన్ని అందుకోనుంది.
అంటే.. ఫుట్‌బాల్ ప్రపంచకప్ 2026లో ఆఖరి స్థానంలో నిలిచే జట్టు అందుకునే నగదు బహుమతి.. టీ20 ప్రపంచకప్‌లో పాల్గొన్న 20 జట్లకు కలిపి పంచిన ప్రైజ్‌మనీ (11.25 మిలియన్ డాలర్లు) దాదాపు సమానంగా ఉంది. ఈ గణాంకాలు ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్‌కు ఉన్న వాణిజ్య విలువ, అభిమానుల ఆదరణ, ప్రసార హక్కుల ఆదాయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. క్రికెట్ కొన్ని దేశాలకు మాత్రమే పరిమితమైన క్రీడగా ఉండగా.. ఫుట్‌బాల్ ప్రపంచంలోని దాదాపు ప్రతి ఖండంలో విస్తరించి ఉంది. అందుకే ఫిఫా ప్రపంచకప్ ప్రైజ్‌మనీ క్రికెట్ ప్రపంచకప్‌లతో పోలిస్తే అనేక రెట్లు ఎక్కువగా ఉంది.
2026 ఫిఫా వరల్డ్‌కప్ మరోసారి ప్రపంచ క్రీడారంగంలో తన ఆధిపత్యాన్ని చాటేందుకు సిద్ధమవుతోంది.
