Gautam Gambhir : సంజూ శాంసన్‌కు గెలుపు క్రెడిట్ మొత్తం ఇవ్వని గంభీర్.. 8 పరుగులు చేసిన ఆటగాడి వల్లే గెలిచామని కామెంట్స్..
మ్యాచ్ అనంతరం టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir)మాట్లాడుతూ చిన్న, చిన్న భాగస్వామ్యాల ప్రాధాన్యతను వివరించాడు.
Gambhir credits Shivam Dube contribution more than Samson in Indias crucial win over West Indies
- వెస్టిండీస్ పై భారత్ విజయం
- టీమ్ఇండియా గెలుపులో కీలక పాత్ర పోషించిన సంజూ శాంసన్
- గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు
Gautam Gambhir : భారత జట్టు వెస్టిండీస్ పై విజయం సాధించి టీ20 ప్రపంచకప్ 2026 సెమీస్‌లో అడుగుపెట్టింది. విండీస్ పై టీమ్ఇండియా గెలవడంలో ఓపెనర్ సంజూ శాంసన్ కీలక పాత్ర పోషించాడు. 196 పరుగుల లక్ష్య ఛేదనలో 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత విజయంలో కీలక పాత్ర పోషించడంతో సంజూ శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.
మ్యాచ్ అనంతరం టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. చిన్న, చిన్న భాగస్వామ్యాల ప్రాధాన్యతను వివరించాడు. మ్యాచ్ 19వ ఓవర్లో శివమ్ దూబె కొట్టిన రెండు బౌండరీలు సంజూశాంసన్ పై ఒత్తిడిని తగ్గించాయని అన్నాడు.
19 ఓవర్లో మొదటి బంతి డాట్ బాల్ కాగా రెండో బంతికి హార్దిక్ ఔట్ అయ్యాడు. దీంతో భారత విజయ సమీకరణం 10 బంతుల్లో 17 పరుగులుగా మారింది. పాండ్యా ఔట్ కావడంతో క్రీజులోకి వచ్చిన దూబె రెండు ఫోర్లు కొట్టడంతో సమీకరణం చాలా తేలికైంది. దూబె ఇన్నింగ్స్ ను ప్రశంసిస్తూ.. జట్టు విజయానికి ప్రతి ఆటగాడి సహకారం ఎంతో కీలకం అవుతుందని గంభీర్ చెప్పుకొచ్చాడు.
‘మనం చిన్న చిన్న సహకారాల గురించి మాట్లాడుకుంటున్నాము. క్రికెట్ అనేది జట్టు ఆట. ఇది ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది. నాకు శివమ్ దూబె కొట్టిన ఆ రెండు బౌండరీలు సంజూ శాంసన్ (97 నాటౌట్) ఇన్నింగ్స్లాగానే ఎంతో ముఖ్యమైనవి అని అనుకుంటున్నాను. ఎందుకంటే శివమ్ ఆ రెండు ఫోర్లు కొట్టకుంటే ఇప్పుడు మనం సంజూ గురించి మాట్లాడుకునే వాళ్లం కాదు.’ అని గంభీర్ అన్నాడు.
అవును పెద్ద ఇన్నింగ్స్‌లు ప్రత్యేకంగా నిలుస్తాయి. కానీ చిన్న చిన్న ఇన్నింగ్స్‌లు మ్యాచ్‌లు గెలిచేందుకు సహాయపడతాయి అని చెప్పుకొచ్చాడు. సంజూ శాంసన్ ప్రపంచ స్థాయి ఆటగాడని, టీమ్‌కు అవసరమైన సమయంలో ప్రతీసారి ముందుకు వస్తాడని అన్నారు.
న్యూజిలాండ్ సిరీస్‌లో అతడు (సంజూ) కఠినమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. కాబట్టి కొన్నిసార్లు అతనికి విరామం ఇవ్వడం కూడా ముఖ్యం. ఎందుకంటే మీరు ఆ ఒత్తిడి పరిస్థితి నుండి కూడా ఆ వ్యక్తిని బయటకు తీసుకురావాలనుకుంటున్నారు. ప్రపంచ కప్ వంటి కీలక మ్యాచ్‌ల్లో అతడు రాణిస్తాడనే నమ్మకం ఉంది. ఈ రోజు అది చేసి చూపించాడని చెప్పుకొచ్చాడు.
