Sanju Samson : ధోని సొంతూరులో మ్యాచ్.. సంజూ శాంసన్‌ను ఊరిస్తున్న భారీ మైలురాయి..
వెస్టిండీస్‌తో రెండో టీ20 మ్యాచ్‌కు ముందు సంజూ శాంసన్‌ను (Sanju Samson ) ఓ భారీ మైలురాయి ఊరిస్తోంది.
- Thota Vamshi Kumar
- Updated on- October 9, 2026 / 08:17 AM IST
IND vs WI 2nd T20 in Ranchi Sanju Samson Need 6 More To Complete 100 Sixes In International T20is
Sanju Samson : రాంచి వేదికగా నేడు (శుక్రవారం అక్టోబర్ 9) న భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత స్టార్ ఆటగాడు సంజూ శాంసన్‌ను ఓ అరుదైన మైలురాయి ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో గనుక అతడు 6 సిక్సర్లు కొడితే.. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 100 సిక్సర్ల మైలురాయిని చేరుకుంటాడు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత్ తరుపున ఇప్పటి వరకు ఐదుగురు.. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీలు మాత్రమే 100 సిక్సర్లు మైలురాయిని అందుకున్నారు. వీరిలో రోహిత్ శర్మ మాత్రమే 200 సిక్సర్ల క్లబ్‌లోనూ చేరిపోయాడు.
ఇక సంజూ శాంసన్ విషయానికి వస్తే.. 2015లో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు. 73 టీ20 మ్యాచ్‌లు డాడు. 26.3 సగటుతో 1578 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 8 అర్థశతకాలు ఉన్నాయి. 133 ఫోర్లు, 94 సిక్సర్లు బాదాడు. రెండో టీ20లో ఆరు సిక్సర్లు కొడితే అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 100 సిక్సర్లు బాదిన ఆరో భారత ఆటగాడిగా రికార్డులకు ఎక్కుతాడు.
ఐపీఎల్‌లో ప్రస్తుతం సంజూ శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు తరుపున ఆడుతున్న సంగతి తెలిసిందే. రెండో టీ20 జరిగే మైదానం రాంచి.. మహేంద్ర సింగ్ ధోని సొంతూరు అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ధోని సొంతూరులో సంజూ ఈ మైలురాయిని చేరుకోవాలని సీఎస్‌కే ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ప్లేయర్లు వీరే..
* రోహిత్ శర్మ – 159 మ్యాచ్‌ల్లో 205 సిక్సర్లు
* సూర్యకుమార్ యాదవ్ – 113 మ్యాచ్‌ల్లో 179 సిక్సర్లు
* అభిషేక్ శర్మ – 63 మ్యాచ్‌ల్లో 135 సిక్సర్లు
* హార్దిక్ పాండ్యా – 138 మ్యాచ్‌ల్లో 126 సిక్సర్లు
* విరాట్ కోహ్లీ – 125 మ్యాచ్‌ల్లో 124 సిక్సర్లు
* కేఎల్ రాహుల్ – 72 మ్యాచ్‌ల్లో 99 సిక్సర్లు
* సంజూ శాంసన్ – 73 మ్యాచ్‌ల్లో 94 సిక్సర్లు
