Priyansh Arya : ఆటగాడికి కౌగిలి.. ఆపై చిలిపి దెబ్బ.. సొట్ట బుగ్గల సుందరి చేసిన పని పై రవిశాస్త్రి కామెంట్స్..
మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ప్రియాంష్ ఆర్య(Priyansh Arya)తో ప్రీతి జింటా కాసేపు సరదాగా మాట్లాడారు.
- Thota Vamshi Kumar
- Updated on- April 26, 2026 / 11:07 AM IST
IPL 2026 DC vs PBKS Preity Zinta Punches Priyansh Arya After Punjab Win Ravi Shastri Comments viral
- ఢిల్లీ రికార్డు లక్ష్య ఛేదన
- పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా ఫుల్ హ్యాపీ
- యువ ఆటగాడు ప్రియంష్ ఆర్య కడుపులో చిన్న దెబ్బ
- వీడియో వైరల్
Priyansh Arya : ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ అదరగొడుతోంది. వరుస విజయాలతో ఓటమే ఎగురని జట్టుగా నిలిచింది. శనివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ సీజన్‌లో పంజాబ్‌కు ఇది ఆరో విజయం.
కేఎల్ రాహుల్ (152 నాటౌట్; 67 బంతుల్లో 16 ఫోర్లు, 9 సిక్సర్లు) భారీ శతకానికి తోడు నితీష్ రాణా (91; 44 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీ చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, జేవియర్ బార్ట్‌లెట్ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం ప్రభ్‌సిమ్రన్ సింగ్ (76; 26 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (71 నాటౌట్; 36 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీలు చేయగా ప్రియాంష్ ఆర్య (43; 17 బంతుల్లో 2 ఫోర్లు 5 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో 265 పరుగుల రికార్డు లక్ష్యాన్ని పంజాబ్ జట్టు 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన తరువాత పంజాబ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పంజాబ్ జట్టు సహ యజమాని ప్రీతి జింటా మైదానంలోకి వెళ్లి ప్లేయర్లను అభినందించారు.
మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ప్రియాంష్ ఆర్యతో కాసేపు సరదాగా మాట్లాడింది. ప్రేమగా కౌగలించుకుంది. ఆ వెంటనే సరదాగా కడుపులో చిన్న పంచ్ ఇచ్చింది. ఇందుకు ప్రియాంష్ కూడా తమాషాగా స్పందించాడు. ఆ సమయంలో కామెంట్రీ అందిస్తున్న రవిశాస్త్రి దీన్ని గమనించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓహ్ అది మంచి పంచ్ అని అన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. .
