Cameron Green : ఎంత ప‌ని చేశావ్ గ్రీన్‌.. కొత్త కారుకు సొట్ట పెట్టావుగా.. అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన టాటా..

అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన గుజ‌రాత్ టైటాన్స్ వ‌ర్సెస్ కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ మ్యాచ్‌లో గ్రీన్ (Cameron Green)కొట్టిన సిక్స‌ర్ కార‌ణంగా కొత్త కారుకు సొట్ట ప‌డింది.

IPL 2026 GT vs KKR Cameron Green Dents Tata Sierra with Massive Six (pic credit@ipl)

  • గుజ‌రాత్‌తో మ్యాచ్‌లో భారీ ఇన్నింగ్స్ ఆడిన గ్రీన్‌
  • అత‌డు కొట్టిన ఓ సిక్స‌ర్ కార‌ణంగా ప్ర‌ద‌ర్శ‌నకు ఉంచిన టాటా కారుకు సొట్ట
  • 5 ల‌క్ష‌లు ఇవ్వ‌నున్న టాటా మోటార్స్‌

Cameron Green : ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ కామెరూన్ గ్రీన్ ఎట్ట‌కేల‌కు ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో ఓ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. 32 ప‌రుగుల‌కే 3 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డిన జ‌ట్టును ఆదుకున్నాడు. తొలుత క్రీజులో కుదురుకునేందుకు ప్ర‌య‌త్నించాడు. ఈ స‌మ‌యంలో 29 బంతుల్లో 27 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. అయితే.. ఆ త‌రువాత ఈ ఆసీస్ ఆట‌గాడు టాప్ గేర్‌లో దూసుకువెళ్లాడు. త‌రువాతి తాను ఎదుర్కొన్న 10 బంతుల్లో 39 ప‌రుగులు రాబ‌ట్టాడు.

మొత్తంగా అత‌డు ఈ మ్యాచ్‌లో 55 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 4 సిక్స‌ర్ల సాయంతో 79 ప‌రుగులు చేశాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌క‌తా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 180 ప‌రుగుల‌కు ఆలౌటైంది. అనంత‌రం శుభ్‌మ‌న్ గిల్ (86; 50 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) రాణించ‌డంతో గుజ‌రాత్ టైటాన్స్ 181 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 19.4 ఓవ‌ర్ల‌లోనే ఛేదించింది.

కారు డ్యామేజ్‌..

ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో గ్రీన్ కొట్టిన ఓ సిక్స‌ర్ కార‌ణంగా మైదానంలో ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచిన టాటా సిమెర్రా కారు డ్యామేజ్ అయింది. ఈ ఘ‌ట‌న కేకేఆర్ ఇన్నింగ్స్ 13వ ఓవ‌ర్‌లో చోటు చేసుకుంది. ఈ ఓవ‌ర్‌ను గుజ‌రాత్ బౌల‌ర్ అశోక్ శ‌ర్మ వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని మూడో బంతిని డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా భారీ సిక్స్‌గా మ‌లిచాడు.

అయితే.. ఆ బంతి వెళ్లి నేరుగా వెళ్లి మైదానంలో ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచిన టాటా సియెర్రా కారును బ‌లంగా తాకింది. దీంతో కారు సొట్ట ప‌డింది. దీంతో అక్క‌డ ఉన్న వారు ఆశ్చ‌ర్య‌పోయారు. బ్యాట‌ర్లు కొట్టిన బంతి మైదానంలో ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచిన‌ కారును తాక‌డం చాలా అరుదుగా జ‌రుగుతూ ఉంటుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

5 ల‌క్ష‌లు ఇవ్వ‌నున్న‌ టాటా..

లీగ్ ప్ర‌ధాన స్పాన్స‌ర్ అయిన టాటా సంస్థ ఓ ప్ర‌త్యేక నిబంధ‌న‌ను అమ‌లు చేస్తోంది. ప్లేయ‌ర్లు కొట్టిన బంతి మైదానంలో ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచిన కారు అద్దాన్ని ప‌గ‌ల‌కొట్టినా, లేదంటే సొట్ట ప‌డిన సంద‌ర్భాల్లో ఆ సంస్థ 5 ల‌క్ష‌ల నుంచి 10 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను క్రికెట్ అభివృద్ధి కోసం స్వ‌చ్చంద సంస్థ‌ల‌కు విరాళంగా ఇస్తూ వ‌స్తోంది. ఇక గ్రీన్ కొట్టిన బంతికి సొట్ట ప‌డ‌డంతో టాటా మోటార్స్ సంస్థ గ్రాస్‌రూట్స్ క్రికెట్ అభివృద్ధికి రూ. 5 లక్షలు విరాళంగా ఇవ్వనుంది.

ఐపీఎల్ 2026 వేలంలో కామెరూన్ గ్రీన్ కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ రూ.25.2 కోట్ల‌కు సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.