MI vs KKR : రోహిత్ శ‌ర్మ‌, ర్యాన్ రికెల్ట‌న్ కానే కాదు.. వారి వ‌ల్లే ఈ అద్భుత విజ‌యం.. హార్దిక్ పాండ్యా హాట్ కామెంట్స్‌..

ఆదివారం వాంఖ‌డే స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ పై ముంబై ఇండియ‌న్స్ 6 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది.

IPL 2026 Hardik Pandya comments after Mumbai Indians beat Kolkata Knight Riders

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో విజ‌యంతో బోణీ కొట్టిన ముంబై
  • కేకేఆర్ పై ఘ‌న విజ‌యం
  • 13 ఏళ్ల త‌రువాత అంటూ హార్దిక్ ఎమోష‌న‌ల్

MI vs KKR : ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ ఘ‌నంగా బోణీ కొట్టింది. ఆదివారం ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ పై 6 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ఈ గెలుపు క్రెడిట్ బౌల‌ర్ల‌కు ద‌క్కుతుంద‌ని ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 220 ప‌రుగులు చేసింది. కేకేఆర్ బ్యాట‌ర్ల‌లో అజింక్యా ర‌హానే (67; 40 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స‌ర్లు), అంక్రిష్ రఘువంశీ (51; 29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచ‌రీలు చేశారు. ముంబై బౌల‌ర్ల‌లో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

అనంత‌రం 221 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ముంబై ఇండియ‌న్స్ 19.1 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి అందుకుంది. ముంబై బ్యాట‌ర్ల‌లో ర్యాన్ రికెల్ట‌న్ (81; 43 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స‌ర్లు), రోహిత్ శ‌ర్మ (78; 38 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీలు చేశారు. కేకేఆర్ బౌల‌ర్ల‌లో వైభ‌వ్ ఆరోరా, కార్తిక్ త్యాగి, సునీల్ నరైన్ లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

13 ఏళ్ల త‌రువాత‌..

ఇక మ్యాచ్ అనంత‌రం గెలుపు ప‌ట్ల ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు. 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్ష‌ణ త‌రువాత టోర్న‌మెంట్‌లో తాము ఆడిన తొలి మ్యాచ్‌లో విజ‌యం సాధించ‌డం సంతోషంగా ఉంద‌న్నాడు. ప్ర‌తిసారి తాము తొలి మ్యాచ్‌లో విజ‌యం సాధించి సీజ‌న్‌ను ఘ‌నంగా ఆరంభించాల‌ని అనుకునే వాళ్లం అని చెప్పుకొచ్చాడు. ఈ సారి అది సాధించినందుకు త‌న‌తో పాటు జ‌ట్టు మొత్తం ఆనందంగా ఉంద‌న్నాడు.

Babar Azam : నువ్వు ఎక్క‌డ దొరికావ్ రా సామీ.. యాడ్ షూట్‌లోనూ క్యాచ్ మిస్‌.. బాబ‌ర్ ఆజామ్ పై ట్రోలింగ్‌..

ప్ర‌స్తుతం క్రికెట్‌లో 220 ల‌క్ష్యాన్ని ఛేదించ‌డం క‌ష్టం కాదు. పైగా ఈ పిచ్ ఎలా స్పందిస్తుందో త‌మ‌కు తెలుస‌న్నాడు. ప్ర‌త్య‌ర్థి ఆట‌గాళ్లు ప‌వ‌ర్ ప్లేలో ఆడిన విధానాన్ని చూసిన త‌రువాత వారిని 230లోపు క‌ట్ట‌డి చేయ‌డం బాగుంది. వారిని 240 నుంచి 250 ప‌రుగులు చేయకుండా క‌ట్ట‌డి చేసిన ముంబై బౌల‌ర్ల‌కు ఖ‌చ్చితంగా క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఒక‌వేళ వారు 250 ప‌రుగులు చేసి ఉంటే క‌ష్టం అయి ఉండేద‌న్నాడు.

ఇక ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, ర్యాన్ రికెల్ట‌న్ లు అద్భుతంగా ఆడార‌ని పాండ్యా మెచ్చుకున్నాడు. గ‌తేడాది కూడా ర్యాన్ బాగా ఆడాడు. అందుక‌నే క్వింట‌న్ డికాక్ బ‌దులుగా అత‌డిని తీసుకున్నాం అని పాండ్యా అన్నాడు. అదే స‌మ‌యంలో క్వింట‌న్ డికాక్ అద్భుత ఆట‌గాడ‌ని, అత‌డికి త‌మ మ‌ద్ద‌తు నిరంత‌రం ఉంటుంద‌న్నాడు.

రోహిత్ శ‌ర్మ బ్యాటింగ్ విందు భోజ‌నం లాంటింద‌న్నాడు. కొన్ని సార్లు అత‌డు ఆడే షాట్లు చూస్తే ఎవ‌రైనా స‌రే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందేన‌న్నాడు. అత‌డి ఆట అసాధార‌ణ‌మైన‌ది, అద్భుతమైన‌ది అన‌డంలో త‌న‌కు ఎలాంటి సందేహం లేద‌న్నాడు. రోహిత్ ఇలా ఆడ‌డం ప‌ట్ల త‌న‌కు చాలా చాలా సంతోషంగా ఉంద‌న్నాడు. మూడు వికెట్లు తీసిన శార్దూల్ గురించి మాట్లాడుతూ.. అత‌డు అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేశాడ‌ని చెప్పుకొచ్చాడు. అత‌డు జ‌ట్టులోకి వ‌చ్చిన‌ప్పుడు తాను ఒకే విష‌యం చెప్పాన‌ని అన్నాడు. ఫ్రాంఛైజీలు మార‌డం ఇక ఆపు.. నీ కెరీర్ మొత్తం ఇక నువ్వు ముంబై ఇండియ‌న్స్‌లోనే ఉండాల‌ని అత‌డికి తాను చెప్పిన‌ట్లు హార్దిక్ వెల్ల‌డించాడు. అత‌డు బ్యాట‌ర్ల‌ను బోల్తా కొట్టించే విధానం చాలా బాగుంటుంద‌న్నాడు.