Rishabh Pant : ఇప్పుడు షమీ కుర్రాడేమీ కాదు.. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు..
కేకేఆర్ పై చిరస్మరణీయమైన విజయం సాధించడం పట్ల లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
- Thota Vamshi Kumar
- Published On : April 10, 2026 / 08:03 AM IST
IPL 2026 KKR vs LSG Rishabh Pant praises Mukul Choudhary and shami (pic credit@IPL)
- ముకుల్ చౌదరి అసాధారణ ఇన్నింగ్స్
- ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన లక్నో
- లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ కీలక వ్యాఖ్యలు
Rishabh Pant : ఐపీఎల్ 2026 సీజన్‌ను ఓటమితో ఆరంభించిన లక్నో సూపర్ జెయింట్స్ ఆ తరువాత ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. గురువారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో లక్నో గెలుపొందింది. ఆశలే లేని దశ నుంచి అద్భుతంగా పుంజుకుని విజయాన్ని అందుకుంది. ఈ చిరస్మరణీయమైన విజయం పట్ల కెప్టెన్ రిషబ్ పంత్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ముకుల్ చౌదరి అసాధారణ ఇన్నింగ్స్ వల్లే ఈ గెలుపు సాధ్యమైందన్నాడు.
అంగ్క్రిష్ రఘువంశీ (33 బంతుల్లో 45 పరుగులు), అజింక్యా రహానే (24 బంతుల్లో 41 పరుగులు) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్, మణిమారన్ సిద్ధార్థ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, అవేష్ ఖాన్ లు తలా ఓ వికెట్ తీశారు.
Virat Kohli : రాజస్థాన్ రాయల్స్‌తో ఆర్‌సీబీ మ్యాచ్.. కోహ్లీని ఊరిస్తున్న భారీ రికార్డు ఇదే..
182 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో ఓ దశలో 128 పరుగలకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో ముకుల్ చౌదరి (54 నాటౌట్; 27 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. సిక్సర్లతో మైదానాన్ని హోరెత్తించాడు. అతడి అసాధారణ ఇన్నింగ్స్‌తో లక్నో జట్టు సరిగ్గా 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. లక్నో బ్యాటర్లలో ముకుల్‌తో పాటు ఆయుష్ బదోని (54; 34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు.
మాటలు రావడం లేదు..
కేకేఆర్ పై విజయం సాధించడం పట్ల మ్యాచ్ అనంతరం లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ముకుల్ చౌదరిపై ప్రశంసల వర్షం కురిపించాడు. అతడి ఆట గురించి వర్ణించేందుకు తన వద్ద మాటలు లేవన్నాడు. అద్వితీయ ప్రదర్శన కనబరిచాడని చెప్పుకొచ్చాడు. ఓ వ్యక్తిని మనం నమ్మినప్పుడు వారు అద్భుతాలు చేయగలరన్నాడు.
ఇక ఆయుష్ బదోని గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం అతడు తమ జట్టులో సీనియర్ ఆటగాడని అన్నాడు. అతడికి ఇచ్చిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. మొదటి రెండు మ్యాచ్‌లలో రాణించలేదు, కానీ ఇలాంటి పరిస్థితిలో అతను చాలా కీలకం. ఈ రోజు మ్యాచ్‌లో అతడు అద్భుమైన పాత్ర పోషించాడు అని పంత్ అన్నాడు.
షమీకి వయసు పై బడుతోంది. ఇప్పుడు అతడేమీ కుర్రాడు కాదు కానీ అతడి అనుభవం ఎంతో విలువైనది. ప్రతి మ్యాచ్ కూడా కలిసి రాదు. అలాంటి సమయంలో అనుభవం ఉన్న ఆటగాడు ఉంటే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. షమీ మాత్రమే కాదు మొత్తం బౌలింగ్ యూనిట్ అంతా రాణిస్తోంది. అని పంత్ తెలిపాడు.
