Deepak Chahar Catch : నువ్వు పట్టి ఉండాల్సింది.. కాదు నువ్వే పట్టాల్సింది.. క్యాచ్ వదిలేసి ఒకరి ముఖాలను మరొకరు.. హార్దిక్ పాండ్యా రియాక్షన్ వైరల్
ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ చాలా పేలవంగా ఉంది. ఈ విషయాన్ని బుధవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యానే (KKR vs MI ) చెప్పాడు
- Thota Vamshi Kumar
- Updated on- May 21, 2026 / 11:14 AM IST
IPL 2026 KKR vs MI match Deepak and Minz stare at each other as catch goes begging
Deepak Chahar: ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ చాలా పేలవంగా ఉంది. ఈ విషయాన్ని బుధవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యానే చెప్పాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో ముంబై నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన కేకేఆర్ ఆటగాడు రోవ్‌మన్ పావెల్ ను ఔట్ చేసే అవకాశాన్ని ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు మిస్ చేశారు. ఒకవేళ ఈ ఈజీ క్యాచ్‌ను వారు అందుకుని ఉంటే ఫలితం మరో రకంగా ఉండేదని పలువురు అంటున్నారు.
కేకేఆర్ ఇన్నింగ్స్ 10 ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. 148 పరుగుల లక్ష్యంతో కేకేఆర్ బరిలోకి దిగింది. 9 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ 10వ ఓవర్‌ను హార్దిక్ పాండ్యా వేశాడు. తొలి బంతి డాట్ కాగా రెండో బంతిని కేకేఆర్ బ్యాటర్ రోవ్‌మన్ పావెల్ డీప్ స్క్వేర్ లెగ్ దిశగా భారీ షాట్ ఆడాడు. బంతి గాల్లోకి లేచింది. బౌండరీ లైన్ వద్ద ఉన్న దీపర్ చాహర్, రాబిన్ మింజ్ ఇద్దరు ఆటగాళ్లు పరిగెత్తుకుంటూ వచ్చారు. అయితే.. ఇద్దరు కూడా మరొకరు క్యాచ్ అందుకుంటారని భావించి.. క్యాచ్‌ను అందుకోకుండా చూస్తూ నిలబడి పోయారు.
దీంతో ఈజీ క్యాచ్ మిస్ అయింది దీన్ని చూసిన హార్దిక్ పాండ్యా తీవ్ర నిరాశను వ్యక్తం చేశాడు. తన షర్టులో ముఖాన్ని దాచుకున్నాడు. అప్పటికి రోవ్‌మన్ స్కోరు 14 పరుగులు మాత్రమే. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అతడు 30 బంతుల్లో 40 పరుగులు చేశాడు. అంతేకాదండోయ్.. మనీశ్ పాండేతో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి ముంబైకి మ్యాచ్‌ను దూరం చేశాడు. ఒకవేళ రోవ్‌మన్ పావెల్ క్యాచ్ పట్టి ఉంటే.. కోల్‌కతా ఇబ్బందుల్లో పడి ఉండేది. క్రికెట్‌లో ఓ నానుడి ఉంది.. క్యాచెస్ విన్ మ్యాచెస్ అని. ఇది దీనికి సరిగ్గా సరిపోతుంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో కార్బిన్ బాష్ (18 బంతుల్లో 32 నాటౌట్), హార్దిక్ పాండ్యా (26), తిలక్ వర్మ (20)లు రాణించారు. కోల్‌కతా బౌలర్లలో సౌరభ్ దుబే, కామెరూన్ గ్రీన్, కార్తీక్ త్యాగీ లు తలా రెండు వికెట్లు, సునీల్ నరైన్ ఓ వికెట్ తీశాడు.
#MI fielders in two minds 🤯
Rovman Powell survives 😮
Updates ▶️ https://t.co/Aw11jLoww5#TATAIPL | #KhelBindaas | #KKRvMI pic.twitter.com/R3iLDNC9Iq
— IndianPremierLeague (@IPL) May 20, 2026
అనంతరం 148 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ 18.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కేకేఆర్ బ్యాటర్లలో మనీశ్ పాండే (33 బంతుల్లో 45 పరుగులు), రోవ్‌మన్ పావెల్ (30 బంతుల్లో 40 పరుగులు) రాణించారు. ముంబై బౌలర్లలో కార్బిన్ బాష్ మూడు, దీపక్ చాహర్, బుమ్రా, ఘజన్‌ఫర్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
