గెలుపు జోష్‌లో ఉన్న సన్‌రైజర్స్‌కు బిగ్ షాక్..
ఎస్ఆర్‌హెచ్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మకు (Abhishek Sharma) ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ భారీ జరిమానా విధించింది.
- Thota Vamshi Kumar
- Updated on- April 3, 2026 / 10:30 AM IST
IPL 2026 KKR vs SRH Abhishek Sharma fined 25% of his match fee (pic credit@ipl)
- అభిషేక్ శర్మకు షాక్
- మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా, ఓ డీమెరిట్ పాయింట్ జత
- ఔటైన తరువాత అభ్యంతరకరమైన లాంగ్వేజ్
Abhishek Sharma : ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది. గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 65 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో జోష్‌లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఎస్ఆర్‌హెచ్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ భారీ జరిమానా విధించింది. అతడు ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లఘించాడని పేర్కొంది. అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం ఫైన్‌గా వేసింది. అంతేకాదండోయ్ అతడి ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్‌ను చేర్చింది.
అసలేం జరిగిందంటే?
ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ అద్భుతంగా ఆడాడు. కేవలం 21 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అయితే.. అతడి ఔట్ కాస్త వివాదాస్పదమైంది. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌ను బ్లెస్సింగ్ ముజరబాని వేశాడు. ఈ ఓవర్‌లోని రెండో బంతిని అభిషేక్ భారీ షాట్ ఆడాడు. అయితే.. బౌండరీ లైన్ వద్ద వరుణ్ చక్రవర్తి డైవ్ చేస్తూ చక్కటి క్యాచ్ అందుకున్నాడు.
Cameron Green Run out : 25 కోట్లు నీళ్ల పాలు.. గ్రీన్ రనౌట్‌లో తప్పుఎవరిది?
వరుణ్ క్యాచ్ పై అనుమానం వచ్చిన ఆన్‌ఫీల్డ్ అంపైర్ల.. థర్డ్ అంపైర్ సాయం కోరారు. పలు యాంగిల్స్‌లో రిప్లేలు పరిశీలించిన థర్డ్ అంపైర్ నితిన్ మీనన్ బ్యాటర్ ఔట్ అని ప్రకటించాడు. కాగా.. ఓ రిప్లేలో బంతి నేలను తాకుతున్నట్లుగా కనిపించింది.
కానీ థర్డ్ అంపైర్ ఆ సమయంలో వరుణ్ చేతి వేళ్లు బంతి కింద ఉన్నాయని భావించి ఔట్ ఇచ్చాడు. థర్డ్ అంపైర్ నిర్ణయం పై అభిషేక్ శర్మ తీవ్ర నిరాశకు వ్యక్తం చేశాడు. అంపైర్ నిర్ణయం పై విభేదించి మైదానాన్ని వీడాడు. ఈ సమయంలో అభిషేక్ అభ్యంతరకరమైన లాంగ్వేజ్ ఉపయోగించినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మ ఐపీఎల్ ప్రవర్తనా నియమాళిని ఉల్లంఘించాడని మ్యాచ్ రిఫరీ నిర్ధారించారు. అభిషేక్ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించడంతో పాటు ఓ డీమెరిట్ పాయింట్‌ను కూడా కేటాయించారు. ‘అతను (అభిషేక్) ఆర్టికల్ 2.3 కింద లెవెల్ 1 నేరాన్ని అంగీకరించి, మ్యాచ్ రిఫరీ విధించిన శిక్షను స్వీకరించాడు. ప్రవర్తనా నియమావళిలోని లెవెల్ 1 ఉల్లంఘనల విషయంలో మ్యాచ్ రిఫరీ నిర్ణయమే అంతిమమైనది.’ అని ఐపీఎల్ ఒక ప్రకటనలో తెలిపింది.
