Sanjiv Goenka : నువ్వే క‌దా మ‌మ్మ‌ల్ని ఓడించింది.. ప్రియాన్ష్ ఆర్య‌తో సంజీవ్ గొయెంకా

మ్యాచ్ అనంత‌రం ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ య‌జ‌మ‌ని సంజీవ్ గొయెంకా (Sanjiv Goenka) చేసిన ప‌నికి అంద‌రూ ఫిదా అయ్యారు.

IPL 2026 PBKS vs LSG Sanjiv Goenka congratulates Priyansh Arya (pic credit@mufaddal_vohra)

  • ల‌క్నో పై పంజాబ్ ఘ‌న విజ‌యం
  • పంజాబ్ గెలుపులో కీల‌క పాత్ర పోషించిన ప్రియాన్ష్ ఆర్య‌
  • మ్యాచ్ అనంత‌రం పంజాబ్ ఓపెన‌ర్‌ను అభినందించిన ల‌క్నో ఓన‌ర్‌

Sanjiv Goenka : ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌కు మ‌రో ప‌రాజ‌యం ఎదురైంది. ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 54 ప‌రుగుల‌తో ఓడిపోయింది. ఈ సీజ‌న్‌లో ల‌క్నో జ‌ట్టుకు ఇది నాలుగో ఓట‌మి కావ‌డం గ‌మ‌నార్హం.

ఇక ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓపెన‌ర్ ప్రియాన్ష్ ఆర్య విధ్వంస‌క ఇన్నింగ్స్ ఆడాడు. కేవ‌లం 37 బంతుల్లోనే 4 ఫోర్లు, 9 సిక్స‌ర్ల సాయంతో 93 ప‌రుగులు చేసి తృటిలో సెంచ‌రీని చేజార్చుకున్నాడు. పంజాబ్ జ‌ట్టు భారీ స్కోరు సాధించ‌డంలో ప్రియ‌న్ష్ కీల‌క పాత్ర పోషించాడు. ఈ క్ర‌మంలోనే అత‌డు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు.

ఇదిలా ఉంటే.. మ్యాచ్ అనంత‌రం ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ య‌జ‌మ‌ని సంజీవ్ గొయెంకా చేసిన ప‌నికి అంద‌రూ ఫిదా అయ్యారు. అత‌డు మైదానంలోకి వెళ్లి పంజాబ్ ఓపెన‌ర్ ప్రియాన్ష్ ఆర్య‌ను ప్ర‌త్యేకంగా అభినందించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇక దీనిపై నెటిజ‌న్లు స‌ర‌దాగా కామెంట్లు చేస్తున్నారు. నీ వల్లే మేము ఓడిపోయాం, నువ్వే క‌దా మ‌మ్మ‌ల్ని ఓడించింది అని ఆర్య‌తో గొయెంకా అని ఉంటాడ‌ని వ్యాఖ్యానిస్తున్నారు.

ALSO READ : ఈ రోజు కొత్త టాటూ వేయించుకున్నా.. పంజాబ్ పై ఓట‌మి అనంత‌రం రిష‌బ్ పంత్ కామెంట్స్ వైర‌ల్‌..

ప్రియ‌న్ష్ ఆర్య‌ను మాత్ర‌మే కాకుండా గొయెంకా పంజాబ్ ప్లేయ‌ర్లు అంద‌రితో ఎంతో స‌ర‌దాగా మాట్లాడాడు గొయెంకా. త‌మ జ‌ట్టు ఓడిపోన‌ప్పుడు ఎంతో కోపంగా త‌మ జ‌ట్టు కెప్ట‌న్ల‌పై విరుచుకుప‌డే గొయెంకాలో ఈ కోణం కూడా ఉందా ? చూసేందుకు చాలా బాగుంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ప్రియాన్ష్ ఆర్య (93; 37 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స‌ర్లు), కూపర్ కొన్నోలీ (87; 46 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స‌ర్లు) చెల‌రేగి ఆడ‌డంతో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 254 ప‌రుగులు చేసింది. ల‌క్నో బౌల‌ర్ల‌లో ప్రిన్స్ యాదవ్, మణిమారన్ సిద్ధార్థ్ లు చెరో రెండు, మోసిన్ ఖాన్, మ‌హ్మ‌ద్ ష‌మీలు త‌లా ఓ వికెట్ సాధించారు.

ఆ త‌రువాత 255 ప‌రుగుల భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో ల‌క్నో జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 200 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ల‌క్నో బ్యాట‌ర్ల‌లో మిచెల్ మార్ష్ (28 బంతుల్లో 40 ప‌రుగులు), ఆయుష్ బ‌దోని (21 బంతుల్లో 35 ప‌రుగులు), కెప్టెన్‌ రిష‌బ్ పంత్ (23 బంతుల్లో 43 ప‌రుగులు), ఐడెన్ మార్‌క్ర‌మ్ (22 బంతుల్లో 42 ప‌రుగులు) రాణించారు. పంజాబ్ బౌల‌ర్ల‌లో మార్కో జాన్సెన్ రెండు, అర్ష్‌దీప్ సింగ్‌, విజ‌య్‌కుమార్ వైశాక్, యుజ్వేంద్ర చాహ‌ల్ లు త‌లా ఓ వికెట్ సాధించారు.