Ruturaj Gaikwad : త‌ప్పు నాదే.. మా వాళ్లు ఇలా బ్యాటింగ్ చేస్తార‌ని అనుకోలేదు.. ముందే తెలిసి ఉంటే..

ఆర్‌సీబీ చేతిలో ఓడిపోవ‌డం త‌న‌ను పూర్తిగా నిరాశ‌ప‌రిచింద‌ని చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad ) తెలిపాడు.

IPL 2026 RCB vs CSK Ruturaj Gaikwad comments after Chennai Super Kings lost match to Royal Challengers Bengaluru (pic credit@ipl)

  • వ‌రుస‌గా మూడో మ్యాచ్‌లో సీఎస్‌కే ఓట‌మి
  • ఆదివారం ఆర్‌సీబీ పై 43 ప‌రుగుల తేడాతో ప‌రాజ‌యం
  • టాప్ ఆర్డ‌ర్‌లో తాను రాణించి ఉంటే ఫ‌లితం మ‌రోలా ఉండేద‌న్న చెన్నై రుతురాజ్

Ruturaj Gaikwad : ఐపీఎల్ 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు ఏదీ క‌లిసి రావ‌డం లేదు. వ‌రుస‌గా మూడో మ్యాచ్‌లోనూ సీఎస్‌కే ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది. ఆదివారం చిన్న‌స్వామి వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్‌లో 43 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. కాగా.. ఈ ఓట‌మి త‌న‌ను పూర్తిగా నిరాశ‌ప‌రిచింద‌ని చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. కోహ్లీ క్యాచ్ మిస్ చేయ‌డం, అన్షుల్ వేసిన నో బాల్ లు త‌మ ప‌తనాన్ని శాసించాయ‌ని చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి 250 ప‌రుగులు చేసింది. ఆర్‌సీబీ బ్యాట‌ర్ల‌లో టిమ్ డేవిడ్ (70 నాటౌట్; 25 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్స‌ర్లు), దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్ (50; 29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) మెరుపు హాఫ్ సెంచ‌రీలు బాదారు. కెప్టెన్ ర‌జ‌త్ పాటిదార్ (48 నాటౌట్; 19 బంతుల్లో 1 ఫోర్‌, 6 సిక్స‌ర్లు), ఫిల్ సాల్ట్ (46; 30 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) లు వేగంగా ఆడారు. సీఎస్‌కే బౌల‌ర్ల‌లో అన్షుల్ కాంబోజ్, జేమీ ఓవర్టన్, శివమ్ దూబే లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

అనంత‌రం 251 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన చెన్నై సూప‌ర్ కింగ్స్ 207 ప‌రుగుల‌కు ఆలౌటైంది. సీఎస్‌కే బ్యాట‌ర్ల‌లో స‌ర్ఫ‌రాజ్ ఖాన్ (50; 25 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ చేశాడు. ప్ర‌శాంత్ వీర్ (43; 29 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌), జేమీ ఓవర్టన్ (37; 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) లు రాణించారు. ఆర్‌సీబీ బౌల‌ర్ల‌లో భువ‌నేశ్వ‌ర్ కుమార్ మూడు వికెట్లు తీశాడు. జాకబ్ డఫీ, అభినందన్ సింగ్, కృనాల్ పాండ్యా లు త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. సుయాష్ శర్మ ఓ వికెట్ సాధించాడు.

నేను ఇంకాస్త బాగా ఆడి ఉంటే..

మ్యాచ్ అనంత‌రం త‌మ జ‌ట్టు ఓట‌మిపై సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు. ఓట‌మి త‌న‌ను నిరాశ ప‌రిచింద‌న్నాడు. అయితే.. వాస్త‌వం చెప్పాలంటే త‌మ జ‌ట్టు బ్యాటింగ్ చేసిన విధానం చూసి తానే ఆశ్చ‌ర్య‌పోయాన‌ని అన్నాడు. స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌, ప్ర‌శాంత్ వీర్‌, జేమీ ఓవ‌ర్ట‌న్‌ల‌తో పాటు కొంత వ‌ర‌కు శివ‌మ్ దూబె కూడా అద్భుతంగా పోరాడార‌ని మెచ్చుకున్నాడు. ఓపెన‌ర్‌గా వ‌చ్చిన తాను ఇంకాస్త మెరుగ్గా రాణించి ఉంటే ఫ‌లితం మ‌రోలా ఉండేద‌ని అభిఫ్రాయ‌ప‌డ్డాడు. ఖ‌చ్చితంగా ఈ ల‌క్ష్యాన్ని తాము ఛేదించి ఉండేవాళ్ల‌మ‌ని చెప్పుకొచ్చాడు. కాబ‌ట్టి మొత్తంగా త‌ప్పు త‌న‌దే అని అన్నాడు.

టిమ్ డేవిడ్ క్లీన్ బౌల్డ్ అయిన బంతి నోబాల్ కావ‌డం గురించి మాట్లాడుతూ.. ‘అన్షుల్ కాంబోజ్ దాదాపుగా అత‌డి వికెట్ తీశాడు. మేం ఆనందంలో ఉన్నాం. అయితే.. ఆ బాల్ నోబాల్ కావ‌డం మా దుర‌దృష్ట‌క‌రం. వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకున్న డేవిడ్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. మైదానం న‌లువైపులా బంతిని బాదాడు. అత‌డు బ్యాటింగ్ చేసిన విధానానికి ఖ‌చ్చితంగా హ్యాట్సాఫ్.’ అని రుతురాజ్ అన్నాడు.

ఫీల్డింగ్‌లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోవడం గురించి స్పందించాడు. ఫీల్డింగ్‌లో తాము ఇంకాస్త మెరుగు కావాల్సి ఉంద‌న్నాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌ను ప‌ట్టి ఉండే బ‌హుశా మ్యాచ్ మూమెంట‌మ్ త‌మ వైపు ఉండేద‌న్నాడు. ఏదీ ఏమైన‌ప్ప‌టికి కూడా ఆర్‌సీబీ ఇన్నింగ్స్ 13, 14 ఓవ‌ర్ వ‌ర‌కు కూడా మ్యాచ్ మా చేతుల్లోనే ఉంద‌న్నాడు. ఆ త‌రువాతే మొత్తం మారిపోయింది అని రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు.

ఈ మ్యాచ్‌లో ఓపెన‌ర్‌గా వ‌చ్చిన రుతురాజ్ గైక్వాడ్ 3 బంతుల్లో ఓ సిక్స్ సాయంతో 7 ప‌రుగులు చేసి ఔట్ అయ్యాడు.