Vaibhav Sooryavanshi : ఏమో సార్‌.. నాకేం తెలియ‌దు.. వైభ‌వ్ సూర్య‌వంశీ కామెంట్స్‌.. నిజంగా నువ్వు చిన్న‌పిల్లాడివే అని నిరూపించావుగా..

హాఫ్ సెంచ‌రీ అనంత‌రం వైభ‌వ్ సూర్య‌వంశీ (Vaibhav Sooryavanshi) త‌న చేతి వేళ్ల‌ను చూపిస్తూ కాస్త వినూత్నంగా సెల‌బ్రేషన్స్ చేసుకున్నాడు.

IPL 2026 RR vs LSG Vaibhav Sooryavanshi comments after 3rd time received player of the match award (pic credit@ipl)

  • ల‌క్నో పై ఘ‌న విజ‌యం
  • రాజ‌స్థాన్ ప్లేఆఫ్స్ ఆశ‌లు స‌జీవం
  • ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డును అందుకున్న వైభ‌వ్ సూర్య‌వంశీ

Vaibhav Sooryavanshi : ప్లేఆఫ్స్ రేసులో నిల‌బ‌డాలంటే త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ అద‌ర‌గొట్టింది. మంగ‌ళ‌వారం జైపూర్ వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. రాజ‌స్థాన్ విజ‌యంలో యువ ఓపెన‌ర్‌, 15 ఏళ్ల వైభ‌వ్ సూర్య‌వంశీ కీల‌క పాత్ర పోషించాడు. ఈ నేప‌థ్యంలో అత‌డు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అర్థ‌శ‌త‌కం సాధించిన త‌రువాత అత‌డు చేసిన సెల‌బ్రేష‌న్స్‌కు సంబంధించిన అర్థం తెలియ‌ద‌ని చెప్పుకొచ్చాడు. ఏదో కొత్త‌గా ఉంటుంద‌ని అలా ట్రై చేశాన‌ని అన్నాడు.

మిచెల్ మార్ష్ (96; 57 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స‌ర్లు), జోష్ ఇంగ్లిష్ (60; 29 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగ‌డంతో తొలుత బ్యాటింగ్ చేసిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 220 ప‌రుగులు చేసింది. రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌లో యశ్ రాజ్ పుంజా రెండు వికెట్లు తీశాడు. జోఫ్రా ఆర్చ‌ర్ ఓ వికెట్ సాధించాడు.

అనంత‌రం 221 ప‌రుగుల ల‌క్ష్యాన్ని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 19.1 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి అందుకుంది. ఆర్ఆర్ బ్యాట‌ర్ల‌లో వైభ‌వ్ సూర్య‌వంశీ (93; 38 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స‌ర్లు), ధ్రువ్ జురెల్ (53 నాటౌట్; 38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీలు చేశారు. య‌శ‌స్వి జైస్వాల్ (43; 23 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) సాధించాడు. ల‌క్నో బౌల‌ర్ల‌లో ఆకాష్ సింగ్, మోసిన్ ఖాన్ లు చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

నా సెల‌బ్రేష‌న్స్‌కు ఎలాంటి అర్థం లేదు..

ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచ‌రీ అనంత‌రం వైభ‌వ్ సూర్య‌వంశీ త‌న చేతి వేళ్ల‌ను చూపిస్తూ కాస్త వినూత్నంగా సెల‌బ్రేషన్స్ చేసుకున్నాడు. ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న త‌రువాత ఈ సెల‌బ్రేష‌న్స్ గురించి అత‌డు మాట్లాడాడు. ఏమో సార్‌.. నాకేం తెలియ‌దు అని అన్నాడు. తాను ప్రతి మ్యాచ్‌లో ఏదో కొత్త స్టైల్ చూపిస్తాన‌ని, దాని గురించి ప్రత్యేకంగా ప్రణాళిక వేసుకోనని చెప్పుకొచ్చాడు. త‌న సెల‌బ్రేష‌న్స్ వెనుక ఎలాంటి అర్థం లేదన్నాడు. గత మ్యాచ్‌లో కూడా తాను చేసిన సంబరానికి కూడా ఎలాంటి అర్థం లేదని చెప్పుకొచ్చాడు. తాను ఎల్ల‌ప్పుడూ కొత్తగా చేయాల‌ని అనుకుంటున్న‌ట్లు చెప్పాడు.

త‌న బ్యాటింగ్ గురించి మాట్లాడుతూ.. తమ జ‌ట్టు బౌలింగ్ చేసే స‌మ‌యంలో తాను డ‌గౌట్‌లో కూర్చొని మ్యాచ్‌ను చూశాన‌ని తెలిపాడు. ఆ స‌మ‌యంలో పిచ్‌ను నిశితంగా ప‌రిశీలించాన‌ని చెప్పుకొచ్చాడు. వికెట్ చాలా బాగుంద‌ని, ఆరంభంలోనే తొంద‌ర ప‌డ‌కూడ‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని చెప్పాడు. కొంత స‌మ‌యంలో క్రీజులో ఉండి ఆ త‌రువాత ఎటాకింగ్ చేయాల‌ని అనుకున్నాన‌ని చెప్పాడు. తాను ఎక్కువ సేపు క్రీజులో ఉంటే మ‌రో ఎండ్‌లో ఉన్న బ్యాట‌ర్‌కు కూడా అది స‌హ‌య‌ప‌డుతుంద‌ని భావించాన‌న్నాడు.

నిదానంగా మొద‌లు పెట్టి ఆ త‌రువాత దూకుడు పెంచ‌డం త‌న ఆలోచ‌న అని స్ప‌ష్టంగా చెప్పాడు. ఇక ఈ సీజ‌న్‌లో మూడోసారి ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవ‌డం పై మాట్లాడుతూ.. ప్ర‌త్యేకంగా త‌న‌కు ఎలాంటి అనుభూతి క‌ల‌గ‌డం లేద‌న్నాడు. త‌న‌పై వ‌చ్చే ప్ర‌శంస‌ల‌ను ప‌ట్టించుకోన‌ని అన్నాడు. వార్తాప‌త్రిక‌ల‌ను చ‌ద‌వ‌న‌ని అన్నాడు. ఇది త‌న కెరీర్ ఆరంభం మాత్రేన‌ని, ఎంతో సుదీర్ఘ కాలం త‌న కెరీర్‌ను కొన‌సాగించాల‌ని అనుకుంటున్నాన‌ని, అప్పుడే ప్ర‌జ‌లు ఇంకా ఎన్నో విష‌యాలు మాట్లాడుకుంటార‌న్నాడు. త‌న దృష్టి ప్ర‌స్తుతం ఆట మీదే ఉంద‌న్నాడు.

లీగ్ ద‌శ‌లో త‌మ చివ‌రి మ్యాచ్ గురించి పెద్ద‌గా ఆందోళ‌న చెంద‌డం లేద‌న్నాడు. ప్ర‌స్తుతం త‌మ ఫోక‌స్ మొత్తం ఆట‌ను ఆస్వాదించ‌డంపైనే ఉంద‌న్నాడు. టోర్నీలో ఎన్నో ఎత్తుప‌ల్లాలు ఎదురు అయ్యాయ‌ని చెప్పుకొచ్చాడు. ఏదీఏమైన‌ప్ప‌టికి కూడా మంచి క్రికెట్ ఆడి మ్యాచ్‌లు గెల‌వ‌డమే త‌మ ఏకైక ల‌క్ష్యం అని తెలిపాడు.