SRH Praful Hinge: తొలి బంతికే వైభవ్ సూర్యవంశీ వికెట్ తీస్తానని చెప్పా.. ప్రపుల్ హెంగే ఆసక్తికర వ్యాఖ్యలు..
సోమవారం రాజస్థాన్ రాయల్స్‌తో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో (SRH vs RR ) తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు ప్రపుల్ హెంగే.
- Thota Vamshi Kumar
- Updated on- April 14, 2026 / 10:34 AM IST
IPL 2026 SRH vs RR Praful Hinge comments after Player of the Match award received
- ఐపీఎల్ అరంగ్రేటంలో అదరగొట్టిన ప్రపుల్ హెంగే
- తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు
- మొత్తంగా నాలుగు వికెట్లతో ఎస్ఆర్‌హెచ్ గెలుపులో కీలక పాత్ర
- ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం
SRH vs RR : ఐపీఎల్ అరంగ్రేటంలోనే అదరగొట్టాడు సన్‌రైజర్స్ హైదరాబాదీ పేసర్ ప్రపుల్ హెంగే. సోమవారం రాజస్థాన్ రాయల్స్‌తో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న వైభవ్ సూర్యవంశీని గోల్డెన్ డకౌట్ గా పెవిలియన్‌కు చేర్చాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో ప్రపుల్ నాలుగు వికెట్లతో రాజస్థాన్ పతనాన్ని శాసించాడు. హైదరాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించడంతో ప్రపుల్ హెంగే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు.
ఇక అవార్డును అందుకున్న అనంతరం ప్రపుల్ హెంగే మాట్లాడుతూ.. ఈ అవార్డును కుటుంబానికి అంకితం ఇస్తున్నట్లుగా చెప్పాడు. తన కోసం వారు ఎన్నో త్యాగాలను చేసినట్లుగా వివరించాడు. వారి వల్లే ప్రస్తుతం తాను ఈ స్థాయిలో ఉన్నానని తెలిపాడు.
తన అరంగ్రేటం గురించి మాట్లాడుతూ.. ఇలాంటి అరంగ్రేటాన్ని తాను ముందే ఊహించినట్లుగా తెలిపాడు. గతేడాదే తాను ఆడే ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో నాలుగు లేదా ఐదు వికెట్లు తీస్తానని ఓ చోట రాసుకున్నానని అలాగే జరిగిందన్నాడు. ఇక పవర్ ప్లేలో వీలైనంత వరకు ఆధిపత్యం చెలాయించుకున్నానని అనుకున్నట్లు చెప్పాడు. తాను నమ్మకాలను బలంగా విశ్వసిస్తానని అన్నాడు.
ఇక తన క్రికెట్ ప్రయాణం గురించి మాట్లాడుతూ.. తాను 13 ఏళ్ల వయసు నుంచే క్రికెట్ ఆడడం ప్రారంభించినట్లు చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో లెదర్ బాల్ క్రికెట్ అంటే ఏమిటో కూడా తనకు తెలియదన్నాడు. ఆ సమయంలో నాన్న ను క్రికెట్ క్లబ్‌లో చేర్పించాలని అడిగితే.. తాను చిన్నవాడినని చెబుతూ రెండు మూడు సార్లు నిరాకరించినట్లు గుర్తు చేసుకున్నాడు. ఎలాగోలా అక్కడి నుంచే అంతా మొదలైందన్నాడు.
వైభవ్ సూర్యవంశీ వికెట్ తనకు ఎంతో నచ్చిందన్నాడు. ఎందుకంటే అతడు ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడని, తొలి బంతికే బౌన్సర్ వేసో, లేకుంటే మరో విధంగానైనా అతడిని ఔట్ చేస్తానని తాను జట్టులో ముందే కొందరికి చెప్పానని అన్నాడు. అలాగే అతడిని ఔట్ చేశానన్నాడు.
ఇక బౌలింగ్ కోచ్ వరుణ్ అరోన్ తనకు చాలా సాయం చేశాడని తెలిపాడు. తనకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశాడు. గతంలో గాయాలతో సతమతమవుతూ ఉండేవాడినని, ప్రస్తుతం అంతా బాగుందన్నాడు. తనను బౌలర్‌గా తీర్చిదిద్దినందుకు MRF పౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలియజేశాడు.
