SRH vs RR : మా ఓట‌మికి ప్ర‌ధాన కార‌ణాలివే.. రియాన్ ప‌రాగ్ కీల‌క వ్యాఖ్య‌లు.. జ‌డేజాకు బౌలింగ్ ఇవ్వ‌క‌పోవ‌డంపై

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవ‌డ‌మే త‌మ కొంప ముంచింద‌ని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కెప్టెన్ రియాన్ ప‌రాగ్ తెలిపాడు.

IPL 2026 SRH vs RR Riyan Parag comments after Rajasthan Royals lost match to Sunrisers Hyderabad (pic credit@IPL)

  • వ‌రుస‌గా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచిన ఆర్ఆర్‌కు షాక్‌
  • స‌న్‌రైజ‌ర్స్ చేతిలో ఓట‌మి
  • కెప్టెన్ రియాన్ ప‌రాగ్ కీల‌క వ్యాఖ్య‌లు

SRH vs RR : వ‌రుస విజ‌యాల‌తో ఫుల్ జోష్‌లో ఉన్న రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు గ‌ట్టి షాక్ త‌గిలింది. సోమ‌వారం ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ తో జరిగిన‌ మ్యాచ్‌లో 57 ప‌రుగుల తేడాతో ప‌రాజ‌యం చ‌విచూసింది. పిచ్‌ను తాము త‌ప్పుగా అంచ‌నా వేశామ‌ని, టాస్ గెలిచిన‌ప్ప‌టికి కూడా ముందుగా బ్యాటింగ్ చేయ‌కుండా.. ఫీల్డింగ్ ఎంచుకోవ‌డ‌మే త‌మ కొంప ముంచింద‌ని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కెప్టెన్ రియాన్ ప‌రాగ్ తెలిపాడు.

ఇషాన్ కిష‌న్ (91; 44 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఆడ‌గా హెన్రిచ్ క్లాసెన్ (40; 26 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స‌ర్లు), నితీశ్ కుమార్ రెడ్డి (26; 13 బంతుల్లో 4 సిక్స‌ర్లు) మెరుపులు మెరిపించ‌డంతో తొలుత బ్యాటింగ్ చేసిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 216 ప‌రుగులు చేసింది. రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌లో జోఫ్రా ఆర్చ‌ర్ రెండు వికెట్లు తీశాడు. సందీప్ శ‌ర్మ‌, తుషార్ దేశ్‌పాండే, రియాన్ ప‌రాగ్‌లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

అనంత‌రం వైభ‌వ్ సూర్య‌వంశీ, ధ్రువ్ జురెల్‌, ప్రిటోరియ‌స్‌లు డ‌కౌట్లు కాగా య‌శ‌స్వి జైస్వాల్ (1), కెప్టెన్ రియాన్ ప‌రాగ్ (4) ఘోరంగా విఫ‌లం కావ‌డంతో 217 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో రాజ‌స్థాన్ 19 ఓవ‌ర్ల‌లో 159 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఓ ద‌శలో 9 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయిన‌ప్ప‌టికి డోనోవన్ ఫెరీరా (69; 44 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), ర‌వీంద్ర జ‌డేజా (45; 32 బంతుల్లో 5 ఫోర్లు)ఆదుకోవ‌డంతో చిత్తు చిత్తుగా ఓడిపోకుండా ఓ మోస్త‌రుగా ఓడిపోయింది. స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్ల‌లో ప్ర‌పుల్ హింగే, స‌కిబ్ హుస్సేన్‌లు చెరో నాలుగు వికెట్లు తీశారు. ఎషాన్ మ‌లింగ రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు.

మేం చేసిన త‌ప్పు అదే..

మ్యాచ్ అనంత‌రం త‌మ జ‌ట్టు ఓట‌మిపై రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కెప్టెన్ రియాన్ ప‌రాగ్ స్పందించాడు. ఈ ఓట‌మి ఎంతో బాధ‌క‌లిగించింద‌న్నాడు. వాస్త‌వం చెప్పాలంటే వ‌రుస‌గా వికెట్లు కోల్పోవ‌డంతో భావోద్వేగాలకు లోన‌య్యేంత స‌మ‌యం కూడా త‌మ‌కు ల‌భించ‌లేద‌న్నాడు. ఈ గెలుపు క్రెడిట్ ఖ‌చ్చితంగా ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్ల‌కు చెందుతుంద‌న్నాడు. ఇక తాము కూడా కొన్ని పొర‌పాట్లు చేశామ‌ని అంగీక‌రించాడు.

పిచ్ బ్యాటింగ్ అనుకూలంగా ఉంద‌న్నాడు. తాము వ‌రుస‌గా వికెట్లు కోల్పోవ‌డాన్ని చూస్తుంటే.. టాస్ గెలిచిన‌ప్పుడు తొలుత బ్యాటింగ్ తీసుకుంటే ప‌రిస్థితి మ‌రో ర‌కంగా ఉండేదేమోన‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. కొత్త బంతికి బ్యాట్‌పైకి చాలా బాగా వ‌చ్చింద‌న్నాడు. అయితే.. బంతి షైన్ కోల్పోయిన త‌రువాత పిచ్ కొంచెం నెమ్మ‌దించింద‌న్నాడు. దీంతో బంతి కాస్త ఆగి వ‌చ్చింద‌న్నాడు.

also read : వైభ‌వ్ సూర్య‌వంశీని గోల్డెన్ డ‌కౌట్ చేసిన ప్ర‌పుల్ హింగే ఎవ‌రు ? వేలంలో స‌న్‌రైజ‌ర్స్ అత‌డిని ఎంత‌కు కొన్న‌దో తెలుస్తే షాకే

తాము ముందుగా బ్యాటింగ్ చేసి రెండో సారి బౌలింగ్ చేసి ఉండాల్సింద‌న్నాడు. అయితే.. ప్ర‌స్తుతం ఇదంతా గ‌తం అని అన్నాడు. ఏదీఏమైన‌ప్ప‌టికి కూడా తాము ఇంకాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సి ఉంద‌న్నాడు. ఎస్ఆర్‌హెచ్ అరంగ్రేట పేస‌ర్లు అద్భుతంగా బౌలింగ్ చేశార‌న్నాడు. అయితే.. దేశ‌వాళీలో ఆ ఇద్ద‌రిని తాను ఎక్కువ‌గా చూడ‌లేద‌న్నాడు. బీహార్ వ‌ర్సెస్ అస్సాం మ్యాచ్‌లో స‌కిబ్ హుస్సేన్ బౌలింగ్‌ను తాను ఎదుర్కొన్న‌ట్లుగా చెప్పుకొచ్చాడు. ఇక హోంగ్రౌండ్‌లో వారిద్ద‌రి ప్లేర్ల‌ను ప్రేక్ష‌కులు నినాదాలు చేస్తున్న‌ప్పుడు వారు కాస్త ఒత్తిడికి గురి అవ్వ‌డం తాను గ‌మ‌నించాన‌ని తెలిపాడు. వారు వేసిన తొలి నాలుగైదు ఓవ‌ర్లు నిజంగా అద్భుతం అని అన్నాడు.

జ‌డేజాకు అందుకే బౌలింగ్ ఇవ్వ‌లేదు..

ఇక ఈ మ్యాచ్‌లో ర‌వీంద్ర జ‌డేజాకు క‌నీసం ఒక్క ఓవ‌ర్ కూడా బౌలింగ్ ఇవ్వ‌లేదు. దీనిపై ప‌రాగ్ మాట్లాడుతూ.. ఇషాన్ చాలా బాగా బ్యాటింగ్ చేస్తుండ‌డంతో జ‌డ్డూకు బౌలింగ్ ఇవ్వ‌లేదు. ఈ నిర్ణ‌యాన్ని అప్ప‌టిక‌ప్పుడు తీసుకున్నాను. ఆ స‌మ‌యంలో నేను ఎలాంటి రిస్క్ తీసుకోవాల‌ని అనుకోలేద‌న్నాడు. జ‌డ్డూ కంటే బిష్ణోయ్ పై న‌మ్మ‌కం ఉంచాన‌న్నాడు. మొత్తంగా త‌మ బౌలర్లు ఓ 30 ప‌రుగులు అద‌నంగా ఇచ్చార‌న్నాడు.

ఇక ఛేజింగ్‌లో తాము 9 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయిన‌ప్ప‌టికి కూడా 160 ప‌రుగులు చేయ‌డం త‌మ బ్యాటింగ్ డెప్త్ ను తెలియ‌జేస్తుంద‌న్నాడు. ఇక ఈ ఓట‌మి నుంచి తాము పుంజుకుంటామ‌ని చెప్పాడు. ఇది ఓ చిన్న అడ్డంకి మాత్ర‌మేన‌న్నాడు. ప్ర‌స్తుతం త‌మ దృష్టి కోల్‌క‌తా మ్యాచ్‌పైనే ఉంద‌న్నాడు.