Praful Hinge : వైభవ్ సూర్యవంశీని గోల్డెన్ డకౌట్ చేసిన ప్రపుల్ హింగే ఎవరు ? వేలంలో సన్‌రైజర్స్ అతడిని ఎంతకు కొన్నదో తెలుస్తే షాకే
ఐపీఎల్‌లో తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ ప్రఫుల్ హింగే(Praful Hinge).
- Thota Vamshi Kumar
- Updated on- April 14, 2026 / 07:37 AM IST
Who Is Praful Hinge took three wickets in first over (pic credit@ipl)
- ఐపీఎల్ అరంగ్రేటంలోనే అదరగొట్టిన ప్రపుల్ హింగే
- రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లకు చుక్కలు చూపించిన సన్‌రైజర్స్ పేసర్
- తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు
Praful Hinge : ఐపీఎల్‌లో తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ ప్రఫుల్ హింగే. సోమవారం ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు ఈ ఘనత సాధించాడు. 217 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ను ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే చావు దెబ్బతీశాడు.
భీకర ఫామ్‌లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని ఇన్నింగ్స్ రెండో బంతికే పెవిలియన్‌కు చేర్చాడు. నాలుగో బంతికి ధ్రువ్ జురెల్, ఆఖరి బంతికి ప్రిటోరియస్‌ను ఔట్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ ముగ్గురు కూడా డకౌట్ కావడం విశేషం. అంతేకాదండోయ్.. తన రెండో ఓవర్‌లో ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్(4)ను సైతం బోల్తా కొట్టించాడు. మొత్తంగా తన నాలుగు ఓవర్ల కోటాలో 34 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం అతడి పేరు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఎవరీ ప్రఫుల్ హింగే?
అదిరిపోయే ప్రదర్శన చేసిన ప్రపుల్ హింగే గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ కు చెందిన ప్రపుల్ సింగ్ 2002 జనవరి 18న సామాన్య కుటుంబంలో జన్మించాడు. మొదట్లో అతడు క్రికెట్ ఆడడం తండ్రికి పెద్దగా ఇష్టం ఉండేది కాదు. అయితే.. 12 ఏళ్ల వయసులో సమ్మర్ క్యాంప్‌లో ప్రపుల్ టాలెంట్‌ను చూశాక గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
Vaibhav Sooryavanshi ✅
Dhruv Jurel ✅
Lhuan-dre Pretorius ✅A dream start for Praful Hinge on his #TATAIPL debut 🧡
Updates ▶️ https://t.co/xGTDdKbXpY#KhelBindaas | #SRHvRR | @SunRisers pic.twitter.com/wLOPGPCqgR
— IndianPremierLeague (@IPL) April 13, 2026
13 ఏళ్ల వయసులోనే తన బౌలింగ్ నైపుణ్యాలను మెరుగుపరచుకున్నాడు. 16 ఏళ్ల వయసులో కోచ్ సంజీవ్ ఆధ్వర్యంలో విదర్భ క్రికెట్ అసోసియేషన్ అకాడమీలో చేరడం అతడి జీవితాన్ని మలుపు తిప్పింది. అండర్ 19 ట్రయల్స్‌లో 36 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు.
10 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 27 వికెట్లు, ఆరు లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 5 వికెట్లు సాధించాడు. విదర్భ ప్రో టీ20 లీగ్‌లో నెకో మాస్టర్ బ్లాస్టర్ జట్టు తరుపున 6 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీసి ఆ జట్టు ఛాంపియన్ గా నిలవడంలో కీలక పాత్రపోషించాడు.
వరుణ్ ఆరోన్ పిలుపు..
గతేడాది తమిళనాడుతో జరిగిన రంజీ మ్యాచ్‌లో ప్రపుల్ ఐదు వికెట్లతో సత్తా చాటాడు. ఆ సమయంలో అతడి ప్రదర్శన చూసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్ వరుణ్ ఆరోన్ అతడిని ట్రయల్స్‌కు ఆహ్వానించాడు. ట్రయల్స్‌లో సత్తా చాటడంతో అతడిని వేలంలో సన్‌రైజర్స్ 30లక్షల బేస్ ప్రైజ్‌కు కొనుగోలు చేసింది. ఇక తాను ఆడిన తొలి మ్యాచ్‌లోనే అదిరిపోయే ప్రదర్శనతో సత్తా చాటాడు ప్రపుల్ హింగే.
