IPL 2027 : ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ పగ్గాలు మళ్లీ రోహిత్ శర్మకే.. తిలక్ వర్మకు గుడ్‌న్యూస్..

IPL 2027 : ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ జట్టులో చాలా మార్పులు జరిగిపోతున్నాయి. మరోసారి రోహిత్‌ శర్మకే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించేందుకు ముంబై యాజమాన్యం సిద్ధమైనట్లు సమాచారం.

Rohit Sharma, Tilak Varma

IPL 2027 : ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ జట్టులో చాలా మార్పులు జరిగిపోతున్నాయి. ప్రధాన కోచ్‌ మహేల జయవర్దనే జట్టును వీడగా.. తాజాగా బౌలింగ్‌ కోచ్‌లు మలింగ, పరాస్‌ మాంబ్రే.. ఫీల్డింగ్‌ కోచ్‌ హాప్కిన్స్‌లకు కూడా వీడ్కోలు పలికింది. అయితే, ఇదే సమయంలో కెప్టెన్సీ మార్పుపై ఆసక్తికర చర్చ మొదలైంది.

Also Read : IND vs NZ : భార‌త్ vs న్యూజిలాండ్ నాలుగో టీ20 మ్యాచ్‌.. జియోలో రానే రాదు.. మ‌రీ ఎక్క‌డ చూడొచ్చంటే?

ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యా భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో.. ఐపీఎల్ 2027 సీజన్ కోసం మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, యువ ఆటగాడు తిలక్ వర్మ పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ ఇద్దరిలో ఒకరికి జట్టు పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

ముంబై ఇండియన్స్‌కు ఐదు ఐపీఎల్ టైటిళ్లు అందించిన కెప్టెన్ రోహిత్ శర్మకు నాయకత్వంలో మంచి అనుభవం ఉంది. 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో అతడి సారథ్యంలోనే ముంబై ఛాంపియన్‌గా నిలిచింది. దీంతో మరోసారి రోహిత్‌కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలనే ఆలోచనలో జట్టు యాజమాన్యం ఉన్నట్లు సమాచారం.

2027 ఐపీఎల్ సీజన్‌లో రోహిత్‌కు 40 ఏళ్లు నిండనున్నాయి. అందువల్ల అతడిని ఒక సీజన్‌కు నాయకుడిగా కొనసాగించి, ఆ తర్వాత దీర్ఘకాలిక కెప్టెన్సీ బాధ్యతలను తిలక్ వర్మకు అప్పగించే అవకాశం ఉందనే చర్చ క్రికెట్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

మరోవైపు యువ ఆటగాడు తిలక్ వర్మ కూడా కెప్టెన్సీ రేసులో బలమైన పోటీదారుగా ఉన్నాడు. ముంబై ఇండియన్స్‌లో కీలక ఆటగాడిగా ఎదిగిన తిలక్ వర్మ.. ప్రస్తుతం భారత టీ20 జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తిలక్‌ వర్మకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని తొలుత ముంబై యాజమాన్యం భావించినట్లు వార్తలు వచ్చాయి.

అయితే, గత సీజన్లో ముంబయి జట్టు వైఫల్యం, జట్టు కోచింగ్ విభాగంలో మార్పులు చేర్పుల నేపథ్యంలో ఇప్పుడు వర్మకు పగ్గాలిస్తే అతను ఒత్తిడికి గురవుతాడని, కాబట్టి ఇంకో ఏడాది ఆగాలని ముంబై యాజమాన్యం భావిస్తోందట. ఈ ప్రక్రియలో భాగంగా ఐపీఎల్ 2027 సీజన్‌కు రోహిత్‌ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తే.. అతడి అనుభవంతో తిలక్‌ను భవిష్యత్ నాయకుడిగా తీర్చిదిద్దే అవకాశం కూడా ఉందని ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఓ నిర్ణయానికి వచ్చినట్లు క్రికెట్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

మరోవైపు హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌లో కొనసాగుతాడా? లేదా ఇతర జట్టుకు మారతాడా? అన్నది ఆసక్తికరంగా మారింది. అతడిని ట్రేడ్ చేసే అవకాశాలపై కూడా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇదిలాఉండగా ముంబై ఇండియన్స్ కోచింగ్ విభాగంలోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. మాహేలా జయవర్ధనే స్థానంలో కీరన్ పొలార్డ్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. తాజాగా.. బౌలింగ్ కోచ్‌లు మలింగ, పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ హాప్కిన్స్ లకు కూడా వీడ్కోలు పలికింది. ఈ విషయాన్ని ఓ ప్రకటనలో తెలిపింది.