Irfan Pathan : 15 ఏళ్ల బుడ్డోడికి బాడీ లైన్ బౌలింగా?.. నేను ఓ బిడ్డకు తండ్రినే.. ఇర్ఫాన్ పఠాన్ కామెంట్స్..
క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీకి గుజరాత్ బౌలర్లు బాడీలైన్ బౌలింగ్ చేయడంపై ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) ఆందోళన వ్యక్తం చేశాడు.
- Thota Vamshi Kumar
- Updated on- May 30, 2026 / 12:28 PM IST
Irfan Pathan Upset By GT bowlers Strategy against Vaibhav Sooryavanshi
- క్వాలిఫయర్-2లో అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీ
- అతడిని అడ్డుకునేందుకు గుజరాత్ బౌలర్ల వ్యూహాలపై ఇర్ఫాన్ ఆందోళన
Irfan Pathan : ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ చేరలేకపోయింది. శుక్రవారం ముల్లన్‌పూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో మిగిలిన ప్లేయర్లు పెద్దగా రాణించకపోయినప్పటికి కూడా వైభవ్ సూర్యవంశీ (96; 47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు) అద్భుతంగా ఆడడంతో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది.
అయితే.. శుభ్‌మన్ గిల్ (104; 53 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ, సాయి సుదర్శన్ (58; 32 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో చెలరేగడంతో 215 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ 18.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఇక ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఎంతో పరిణితి ప్రదర్శించాడు. ఓవైపు వికెట్లు పడుతుండడంతో పరిస్థితులకు తగ్గట్లుగా ఆడాడు. తన జట్టుకు మెరుగైన స్కోరు అందించే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. కగిసో రబాడ, మహ్మద్ సిరాజ్ బంతులతో పరీక్షించినా కూడా వెరవలేదు. వారు బాడీలైన్ బౌలింగ్ వేస్తూ వైభవ్‌పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు.
దీనిపై టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆందోళన వ్యక్తం చేశాడు. ’15 ఏళ్ల వైభవ్ సూర్యవంశిని ఆపడానికి బాడీలైన్ బౌలింగ్ చేయడం నాకు నచ్చలేదు. అతను పెద్ద ఆటగాళ్లతో ఆడుతున్నాడని నాకు తెలుసు.. కానీ నాలోని తండ్రి దానికి అంగీకరించడు.’ అని పఠాన్ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
