Ishan Kishan : అట్టర్ ఫ్లాప్ మ్యాచ్‌లోనూ.. ఇషాన్ కిషన్ అరుదైన ఘనత.. కోహ్లీ, కేఎల్ రాహుల్ సరసన
టీమ్ఇండియా బ్యాటర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) అరుదైన ఘనత సాధించాడు.
- Thota Vamshi Kumar
- Updated on- July 10, 2026 / 09:59 AM IST
Ishan Kishan completes 7000 runs in T20s
- టీ20 క్రికెట్‌లో ఇషాన్ కిషన్ అరుదైన ఘనత
- 7వేల పరుగుల మైలురాయి చేరిక
- అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన మూడో భారత బ్యాటర్‌గా రికార్డు
Ishan Kishan : టీమ్ఇండియా బ్యాటర్ ఇషాన్ కిషన్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో 7 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఇంగ్లాండ్‌తో బ్రిస్టల్ వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో నాలుగు పరుగులు చేయడం ద్వారా అతడు ఈ ఘనత అందుకున్నాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వంటి దిగ్గజాల సరసన చేరాడు.
టీ20 క్రికెట్‌లో 7 వేల పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా చేరుకున్న మూడో భారత ఆటగాడిగా ఇషాన్ కిషన్ రికార్డులకు ఎక్కాడు. 240 ఇన్నింగ్స్‌ల్లో అతడు ఈ మైలురాయిని చేరుకున్నాడు. కాగా.. కేఎల్ రాహుల్ 197 ఇన్నింగ్స్‌ల్లో, విరాట్ కోహ్లీ 212 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించారు.
టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 7వేల పరుగుల మైలురాయిని చేరుకున్న భారత ప్లేయర్లు వీరే..
* కేఎల్ రాహుల్ – 197 ఇన్నింగ్స్‌లు
* విరాట్ కోహ్లీ – 212 ఇన్నింగ్స్‌లు
* ఇషాన్ కిషన్ – 240 ఇన్నింగ్స్‌లు
ఇక ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ విఫలం అయ్యాడు. 6 బంతులు ఎదుర్కొన్ని పేసర్ జోష్ టంగ్ బౌలింగ్‌లో సామ్ కరన్ క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ (49 బంతుల్లో 80 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించగా మిగిలిన వారు విఫలం కావడంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్‌లు చెరో రెండు వికెట్లు, విల్ జాక్స్, ఆదిల్ రషీద్ తలా ఓ వికెట్ పడగొట్టారు.
ఆ తరువాత హ్యారీ బ్రూక్ (35 బంతుల్లో 79 నాటౌట్), ఫిల్ సాల్ట్ (42 బంతుల్లో 59 నాటౌట్) రాణించడంతో 159 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 13.5 ఓవర్లలో వికెట్ కోల్పోయి ఛేదించింది. దీంతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లాండ్ కైవసం చేసుకుంది.
