kieron Pollard : రషీద్ ఖాన్ బౌలింగ్లో సిక్సర్ల మోతమోగించిన పొలార్డ్.. వీడియో వైరల్
కీరన్ పోలార్డ్ రెచ్చిపోయాడు. మైదానంలో సిక్సర్ల మోత మోగించాడు. రెండుకాదు మూడు కాదు.. ఒకే ఓవర్లో వరుసగా ఐదు సిక్సులు బాదాడు.
- Harish Thanniru
- Updated on- August 11, 2024 / 10:28 AM IST
kieron Pollard
kieron Pollard – Rashid Khan : కీరన్ పోలార్డ్ రెచ్చిపోయాడు. మైదానంలో సిక్సర్ల మోత మోగించాడు. రెండుకాదు మూడు కాదు.. ఒకే ఓవర్లో వరుసగా ఐదు సిక్సులు బాదాడు. అదీ ఎవరి బౌలింగ్ అనుకుంటున్నారా.. ఆఫ్ఘనిస్థాన్ ప్లేయర్ రషీద్ ఖాన్ బౌలింగ్ లో కావటం విశేషం. రషీద్ ఖాన్ ఈతరం అత్యుత్తమ స్పిన్ బౌలర్లలో ఒకడు. అతని బౌలింగ్ లో పోలార్డ్ వచ్చిన బాల్ వచ్చినట్లు బౌండరీలైన్ వైపు బాదడంతో రషీద్ ఖాన్ బాల్ వేసి బౌండరీలైన్ వైపు చూస్తుండిపోవాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read Also : Olympics 2024 : పతకాలు తగ్గినా.. ప్రదర్శన బేష్..! పారిస్ ఒలింపిక్స్లో ముగిసిన భారత్ పోరు
ది హండ్రెడ్ పురుషుల కాంపిటీషన్ 2024 టోర్నీలో భాగంగా వెస్టిండీస్ మాజీ ప్లేయర్ పోలార్డ్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. తద్వారా ఒకే ఓవర్లో వరుసగా ఐదు సిక్సర్లు కొట్టిన అతికొద్ది మంది బ్యాటర్లలో పోలార్డ్ ఒకడిగా చేరిపోయాడు. ఈ టోర్నీలో సదరన్ బ్రేవ్ వర్సెస్ ట్రెంట్ రాకెట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సదరన్ బ్రేవ్ బ్యాటర్ పోలార్డ్ బ్యాట్ తో వీరంగం సృష్టించాడు. 23 బంతుల్లో 45 పరుగులు చేశాడు. ఇందులో రెండు ఫోర్లు, ఐదు సిక్సులు ఉన్నాయి. పోలార్డ్ దూకుడైన బ్యాటింగ్ తో సదరన్ బ్రేవ్ 1 బంతి మిగిలి ఉండగానే రెండు వికెట్ల తేడాతో ట్రెంట్ రాకెట్స్ పై విజయం సాధించింది.
37ఏళ్ల కీరన్ పోలార్డ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి, ప్రపంచంలోని అన్ని ప్రధాన టీ20 లీగ్ లనుంచి రిటైర్ అయిన విషయం తెలిసిందే. పోలార్డ్ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్ గా కూడా పనిచేశాడు. అతను 2022లో ఐపీఎల్ ఆడకుండా రిటైర్ అయ్యాడు. ఆ తరువాత ముంబై ఇండియన్స్ కోచింగ్ టీమ్ లో భాగమయ్యాడు.
