కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రదర్శన అద్భుతం. ప్లే ఆఫ్ రేసులో నిలవాలనే పట్టుదలతో ముంబై ఇండియన్స్‌ను ఊచకోత కోశారు. ఐపీఎల్ లీగ్ ఆరంభం నుంచి ఏప్రిల్ 29 ఆదివారం నాటికి ముగిసిన మ్యాచ్‌తో కోల్‌కతా 100 విజయాలు పూర్తి చేసుకుంది. వందో విజయం పొందిన మ్యాచ్‌లో ముంబైపై 34 పరుగుల తేడాతో గెలుపొందింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగి తొలి వికెట్ అవుట్ అవడానికి ముందే 96 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు ఓపెనర్లు. (29 బంతుల్లో 54 పరుగులు)క్రిస్ లిన్ తర్వాత శుభ్‌మాన్ గిల్ కాసేపటి వరకూ దూకుడు కొనసాగించి (76; 45 బంతుల్లో ) చేయగలిగాడు. ఆ తర్వాత మూడో వికెట్‌గా బరిలోకి దిగిన రస్సెల్ మ్యాచ్‌ను తనవైపుకు తిప్పేసుకున్నాడు.
తన పుట్టినరోజున సీజన్‌లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్ కావడంతో విధ్వంసం సృష్టించాడు. 40 బంతుల్లో 6 బౌండరీలు, 8 సిక్సులతో 80 పరుగులు పూర్తి చేసుకున్నాడు. చేధనకు దిగిన ముంబై ఇండియన్స్ ఒత్తిడికి లోనైయ్యారు. పేలవమైన స్కోరుతో పెవిలియన్ చేరుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆండ్రీ రస్సెల్ హిట్టింగ్ తర్వాత బ్యాటింగ్ అంటే హార్దిక్ పాండ్యాదే.
కేవలం 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 34బంతులు ఆడి 9 సిక్సులు, 6 బౌండరీలతో 91పరుగులు పూర్తి చేసుకున్నాడు. చివరి ఓవర్లలో అవుట్ అవడంతో ముంబై ఇండియన్స్ ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది.
దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ ఖాతాలో వందో విజయం వచ్చి చేరింది. ఐపీఎల్‌లో వంద విజయాలు పూర్తి చేసుకున్న జట్లలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌లతో పాటు కోల్‌కతా నైట్ రైడర్స్ చేరిపోయింది.