వరల్డ్ కప్‌కు ముందు ‌భారత్‌‌కు ఆఖరి అవకాశం

ప్రపంచ దేశాలన్నీ అంతర్జాతీయ వేదికలపై తలపడేందుకు ఐసీసీ నిర్వహిస్తోన్న ఐసీసీ వరల్డ్ కప్ 2019కు మరి కొద్ది నెలల సమయం మాత్రమే ఉంది. జట్లన్నీ మే 30నుంచి జరగనున్న అంతర్జాతీయ టోర్నీలో తలపడేందుకు షెడ్యూల్‌ను ముందుగానే ప్లాన్ చేసుకున్నాయి. ఈ క్రమంలో ప్రపంచ కప్‌కు ముందు భారత్ గడ్డపై ఫిబ్రవరి 24నుంచి జరగనున్న మ్యాచ్‌లే టీమిండియాకు ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్‌లు. 

ఆ తర్వాత ప్లేయర్లంతా ఐపీఎల్‌లో బిజీగా మారిపోనున్నారు. లీగ్ ముగిసిన కొద్ది రోజులకే వరల్డ్ కప్ ఆరంభమవుతోంది. కాబట్టి ప్రపంచ కప్‌కు ముందు ఆడనున్న అంతర్జాతీయ జట్టు ఇదే కావడంతో కెప్టెన్ కోహ్లీ వరల్డ్ కప్ జట్టును సెట్ చేసుకోవడానికి ఇదే ఆఖరి అవకాశం. 

ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా జట్టుకు మాత్రం భారత్ తర్వాత పాక్‌తో తలపడే అవకాశం మిగిలే ఉంది. సొంతగడ్డపై భారత్ చేతుల్లో చిత్తుగా మిగిలిన ఆసీస్.. ఈ సారి కొత్త ప్రణాళికలతో బరిలోకి దిగాలని ప్రయత్నిస్తోంది. కాగా, భారత్ ఇప్పటికే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్‌లను విజయవంతంగా ముగించుకుని సొంతగడ్డపై అడుగుపెట్టాయి. 

కాగా, ఈ మ్యాచ్‌లలో విజయం సాధించాలని ఇరు జట్లు పట్టుదలతో కనిపిస్తున్నాయి. ప్రపంచ కప్ టోర్నీలో ఈ అనుభవాన్ని ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ప్లేయర్ల  బలహీనతలను అధిగమించి జట్టును పటిష్టంగా తయారుచేసుకోవాలనే కసరత్తుల్లో ఉన్నాయి.