Wanindu Hasaranga : మలింగ, రషీద్ ఖాన్, అఫ్రిది రికార్డులను బ్రేక్ చేసిన వనిందు హసరంగా..
టీ20 ప్రపంచకప్ 2026లో శ్రీలంక స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగా (Wanindu Hasaranga) అరుదైన ఘనత సాధించాడు
Most wickets in T20 World Cups Wanindu Hasaranga surpasses Shahid Afridi
Wanindu Hasaranga : టీ20 ప్రపంచకప్ 2026లో శ్రీలంక స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగా అరుదైన ఘనత సాధించాడు. పొట్టి ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఆదివారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టడంతో ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో అతడు పాక్ దిగ్గజ ఆటగాడు షాహిద్ అఫ్రిదిని అధిగమించాడు.
ఈ మ్యాచ్‌కు ముందు 37 వికెట్లతో ఉన్న హసరంగా.. మూడు వికెట్లు తీయడంతో పొట్టి ప్రపంచకప్ చరిత్రలో 40 వికెట్లకు చేరుకున్నాడు. ఈ క్రమంలో అతడు తొలుత మలింగ, రషీద్ ఖాన్‌లను అధిగమించగా ఆ తరువాత షాహిద్ అఫ్రిదిని అధిగమించాడు. ఇక టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు బంగ్లాదేశ్ ఆటగాడు షకీబ్ హసన్ పేరిట ఉంది. షకీబ్ 43 మ్యాచ్‌ల్లో 50 వికెట్లు తీశాడు.
టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే..
* షకీబ్ అల్ హసన్ – 43 మ్యాచ్‌ల్లో 50 వికెట్లు
* వనిందు హసరంగా – 20 మ్యాచ్‌ల్లో 40 వికెట్లు
* షాహిద్ అఫ్రిది – 34 మ్యాచ్‌ల్లో 39 వికెట్లు
* లసిత్ మలింగ – 31 మ్యాచ్‌ల్లో 38 వికెట్లు
* రషీద్ ఖాన్ – 24 మ్యాచ్‌ల్లో 38 వికెట్లు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో కుసాల్ మెండిస్ (56 నాటౌట్; 43 బంతుల్లో 5 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. కమిండు మెండిస్ (44; 19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆఖరిలో వేగంగా ఆడాడు. ఐర్లాండ్ బౌలర్లలో బారీ మెక్‌కార్తీ, జార్జ్ డాక్రెల్ లు చెరో రెండు వికెట్లు తీశారు. మార్క్ అడైర్, గారెత్ డెలానీ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం 164 పరుగుల లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ 19.5 ఓవర్లలో 143 పరుగులకే కుప్పకూలింది. దీంతో లంక జట్టు 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐర్లాండ్ బ్యాటర్లలో హ్యారీ టెక్టర్ (40; 34 బంతుల్లో 1 ఫోర్), రాస్ అడైర్ (34; 23 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) లు రాణించారు. లంక బౌలర్లలో వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ చెరో మూడు వికెట్లు తీశారు. మతీషా పతిరాణా రెండు వికెట్లు పడగొట్టాడు.
