PAK vs NZ : కివీస్ చేతిలో పాక్ ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన చిన్నారి..
నిలకడలేమికి మారు పేరు పాకిస్తాన్. ఆ జట్టు ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవ్వరూ చెప్పలేరు.
- Thota Vamshi Kumar
- Updated on- April 26, 2024 / 03:13 PM IST
New Zealand Beat Pakistan By 4 Runs In 4th T20I
Pakistan vs New Zealand : నిలకడలేమికి మారు పేరు పాకిస్తాన్. ఆ జట్టు ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఆ జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలతో పాటు ఫిట్‌నెస్ మెరుగుపరిచేందుకు న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు దాదాపు రెండు వారాల పాటు ఆర్మీ చేత స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇప్పించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ). తీరా కివీస్‌తో సిరీస్‌లో పాకిస్తాన్ చతికిల బడుతోంది. ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో నాలుగు మ్యాచులు ముగిసే సరికి 1-2తేడాతో వెనుకబడి ఉంది.
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్లు అందరూ ఐపీఎల్‌లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తృతీయ శ్రేణి ఆటగాళ్లతో కూడిన జట్టును కివీస్ బోర్డు పాకిస్తాన్‌కు పంపించింది. దీంతో ఈజీగా సిరీస్ క్లీన్ స్వీప్ చేసి టీ20 ప్రపంచకప్ ముందు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని భావించిన పాకిస్తాన్‌కు వరుస షాకులు తగులుతున్నాయి. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలిచింది. మూడో మ్యాచ్‌లో కివీస్ విజయం సాధించగా.. లాహోర్‌లోని గఢాఫీ స్టేడియంలో ఉత్కంత భరితంగా జరిగిన నాలుగో మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలుపొందింది.
Sunil Gavaskar : కోహ్లి స్ట్రైక్‌రేట్‌పై మండిపడ్డ గావస్కర్.. ఇలాగేనా ఆడేది?
ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో టిమ్ రాబిన్సన్ (36 బంతుల్లో 51), ఫాక్స్‌క్రాఫ్ట్ (26 బంతుల్లో 34) లు రాణించారు. పాక్ బౌలర్లలో మహ్మద్ అమీర్, జమాన్ ఒక్కొ వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 174 పరుగులకే పరిమితమైంది. పాక్ బ్యాటర్‌లో ఫఖార్ జమాన్ (45 బంతుల్లో 61) హాఫ్ సెంచరీ చేశాడు. ఆఖర్లో ఇమాద్ వసీం(11 బంతుల్లో 22 నాటౌట్) పోరాడాడు.
పాకిస్తాన్ విజయానికి ఆఖరి బంతికి ఆరు పరుగులు అవసరం కాగా ఇమాద్ వసీం ఒక్క పరుగే తీయడంతో నాలుగు పరుగుల తేడాతో పాక్ ఓడిపోయింది. గెలిచే మ్యాచ్ ఓడిపోవడంతో పాకిస్తాన్ అభిమానులు భావోద్వేగానికి లోనైయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఇరు జట్ల మధ్య శనివారం ఐదో టీ20 మ్యాచ్ జరగనుంది.
