IND vs PAK : భారత ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ గురించి.. పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా హాట్ కామెంట్స్..
కొలంబో వేదికగా ఆదివారం భారత్ వర్సెస్ పాక్ (IND vs PAK ) మ్యాచ్ జరగనుంది.
Pakistan skipper Salman Agha key comments on hand shake with Team India players
IND vs PAK : టీ20ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 15) కొలంబో వేదికగా భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. కాగా.. ఈ మ్యాచ్‌కు ఒక రోజు ముందు అంటే శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా కీలక వ్యాఖ్యలు చేశాడు. రేపటి మ్యాచ్‌లో క్రీడా స్ఫూర్తి కనిపిస్తుందని ఆశిస్తున్నాను అని వ్యాఖ్యానించాడు.
ఇక భారత ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అనే ప్రశ్నకు సల్మాన్ కు ఎదురైంది. అతడు అవును అని, కాదు అని సమాధానం ఇవ్వలేదు. అది రేపు తెలుస్తుంది అంటూ దాటవేశాడు.
పహల్గాం దాడికి నిరసనగా ఆసియా కప్2025లో భారత జట్టు పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. అప్పట్లో పాక్ దీనిపై పెద్ద రాద్దాంతం చేసిన సంగతి తెలిసిందే.
ఇక టీ20 ప్రపంచకప్‌లలో పాక్ జట్టుపై భారత్‌కు ఘనమైన రికార్డు ఉంది. పొట్టి ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు రెండు జట్లు ఎనిమిది సార్లు ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో ఏడు మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది. కేవలం ఒక్క మ్యాచ్‌లోనే పాక్ గెలుపొందింది.
దీని గురించి సల్మాన్ మాట్లాడుతూ.. గత రికార్డుల గురించి తాము పట్టించుకోమని అన్నాడు. ప్రతి రోజు కొత్త రోజు అవుతుందన్నాడు. ‘మేము చరిత్రను మార్చలేము. కానీ రేపు గెలిచేందుకు మాత్రం ఖచ్చితంగా ప్రయత్నిస్తాం.’ అని సల్మాన్ తెలిపాడు.
అభిషేక్ శర్మ గురించి..
యూఎస్ఏతో మ్యాచ్‌లో డకౌట్ అయిన అభిషేక్ శర్మ ఆతరువాత కడుపు నొప్పి కారణంగా నమీబియాతో మ్యాచ్‌కు దూరం అయిన సంగతి తెలిసిందే. దీనిపై సల్మాన్ మాట్లాడుతూ.. అభిషేక్ కోలుకోవాలని ఆకాంక్షించాడు. అతడు రేపటి మ్యాచ్‌లో ఆడాలని కోరుకున్నాడు. తాము అత్యుత్తమ ఆటగాళ్లతోనే పోటీపడాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు.
శ్రీలంకలో ఆడడంపై..
టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్ ఆడే మ్యాచ్‌లు అన్ని శ్రీలంక వేదికగానే జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో రేపటి మ్యాచ్‌లో భారత్‌ను ఓడిస్తామన్న ధీమాను వ్యక్తం చేశాడు పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా. ‘మేము వాతావరణానికి బాగా అలవాటు పడ్డాము. పిచ్ గురించి మంచి అవగాహన ఉంది. ఇది మాకు ఎంతో అడ్వాంటేజ్. మేము 40 ఓవర్లు నాణ్యమైన క్రికెట్ ఆడితే సరిపోతుంది.’అని సల్మాన్ అన్నాడు.
