IND vs PAK : వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే భారత్, పాక్‌లలో ఎవరికి ఎక్కువ లాభం? తదుపరి దశకు వెళ్లేందుకు ఏ జట్టుకు ఎక్కువ అవకాశం అంటే ?
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా జరగాల్సిన భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్‌కు (IND vs PAK) వర్షం ముప్పు పొంచి ఉంది.
Which team get more advantage if IND vs PAK match Washed Out( Image Credit to Original Source )
IND vs PAK : టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 15)న భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. మొన్నటి వరకు ఈ మ్యాచ్‌లో తాము ఆడమని వెల్లడించిన పాక్ మెట్టు దిగి వచ్చింది. దీంతో భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్‌ను చూడొచ్చునని క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆనందంగా ఉన్నారు. అయితే.. తాజాగా వారి ఆశలకు మరో అడ్డంకి పడింది. వర్షం కారణంగా మ్యాచ్ సజావుగా జరిగే అవకాశాలు కనిపించడం లేదు.
మ్యాచ్ జరిగే ఆదివారం రోజున కొలంబో భారీ వర్షం పడే సూచనలు ఉన్నట్లు శ్రీలంక వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం పగటి పూట 65 శాతం ఉన్నట్లు పేర్కొంది. కొన్ని నివేదికల ప్రకారం మ్యాచ్ జరిగే సమయం రాత్రి 7 గంటల ప్రాంతంలో 49 నుంచి 65 శాతం పడవచ్చునని తెలుస్తోంది. మొత్తం మీద ఆకాశం మేఘావృతమై ఉండడంతో పాటు ఉత్తరం నుంచి గంటకు 11 మైళ్ల వేగంతో గాలులు వీస్తాయని అంటున్నారు.
మ్యాచ్ రద్దైతే పరిస్థితి ఏంటి?
సాధారణంగా టీ20 మ్యాచ్‌ల్లో ఫలితం రావాలంటే ఇరు జట్లు కనీసం ఐదేసి చొప్పున ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. ఇలా కూడా మ్యాచ్‌ను నిర్వహించలేని పక్షంలో రద్దు చేస్తారు. భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ గ్రూపు స్టేజీ మ్యాచ్ కావడంతో దీనికి ఎలాంటి రిజర్వ్ డే ఉండదు. అందుకని మ్యాచ్ రద్దు అయితే ఇరు జట్లకు ఒక్కొ పాయింట్‌ను కేటాయిస్తారు.
భారత్, పాక్‌లలో ఎవరికి లాభం?
ప్రస్తుతం భారత్, పాక్ జట్లు ఈ మెగాటోర్నీలో చెరో రెండు మ్యాచ్‌లు ఆడి గెలుపొందాయి. ఇరు జట్ల ఖాతాల్లో 4 పాయింట్ల చొప్పున ఉన్నాయి. భారత రన్‌రేట్ మెరుగ్గా ఉండడంతో గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో ఉండగా పాక్ రెండో స్థానంలో ఉంది.
ఇక వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే.. ఇరు జట్లకు ఒక్కొ పాయింట్‌ను కేటాయిస్తారు. అప్పుడు రెండు జట్ల ఖాతాల్లో ఐదేసి పాయింట్లు ఉంటాయి. అప్పుడు గ్రూప్ దశలో మిగిలిన మ్యాచ్‌లతో సంబంధం లేకుండా భారత్, పాక్ జట్లు సూపర్-8కి అర్హత సాధిస్తాయి. ఎందుకంటే యూఎస్ఏ, నెదర్లాండ్స్, నమీబియా జట్లు తాము ఆడాల్సి ఉన్న మ్యాచ్‌ల్లో గెలుపొందినా సరే భారత్, పాక్ జట్ల పాయింట్లను అధిగమించలేవు.
అయితే.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో సూపర్-8కి వెళ్లే జట్టుకు కాస్త అడ్వాంటేజ్ ఉంటుంది. తమ చివరి మ్యాచ్‌ల్లో నెదర్లాండ్స్‌తో భారత్, నమీబియాతో పాక్ ఆడాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో పాక్ అగ్రస్థానంతో సూపర్-8కి వెళ్లాలంటే నమీబియాను భారీ తేడాతో ఓడించాల్సి ఉంటుంది. అదే సమయంలో నెదర్లాండ్స్ చేతిలో భారత్ ఓడిపోవడం గానీ, తక్కువ తేడాతోనే గెలవాల్సి ఉంటుంది.
