Prithvi Shaw Akriti Agarwal : క్రికెటర్ పృథ్వీ షాకు షాకిచ్చిన కాబోయే భార్య.. ఎంగేజ్‌మెంట్ రద్దు.. ఆకృతి అగర్వాల్ ఇన్‌స్టాలో పోస్ట్ వైరల్
Prithvi Shaw Akriti Agarwal : టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
- Harish Thanniru
- Updated on- September 17, 2026 / 05:39 PM IST
Prithvi Shaw Akriti Agarwal
Prithvi Shaw Akriti Agarwal : టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పృథ్వీ షా, ఆయనకు కాబోయే భార్య అకృతీ అగర్వాల్ విడిపోయారు. నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించిన సుమారు ఆరు నెలలకే ఈ జంట తమ బంధాన్ని ముగించుకోవాలని నిర్ణయించుకుంది. సోషల్ మీడియా పర్సనాలిటీ, నటి అయిన అకృతీ అగర్వాల్ గురువారం సోషల్ మీడియాలో చేసిన ప్రకటన ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.
తన చిరకాల ప్రేయసితో ఏడడుగులు వేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ఈ ఏడాది మార్చి నెలలో పృథ్వీషా తన సోషల్ మీడియా ఖాతాలో ఫోటోలు పంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇక పెళ్లే తరువాయి అనుకున్న తరుణంలో ఆకృతి అగర్వాల్ ఊహించని షాకిచ్చింది. తమ వివాహం రద్దయిపోయిందని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమె ప్రకటించింది. ఈ నిర్ణయం పృథ్వీ షా, నేను కలిసి తీసుకున్నామని, తమ భవిష్యత్తు లక్ష్యాలు, ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని గుర్తించిన తర్వాత విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తమ విడిపోవడానికి గల కారణాలపై ఎలాంటి ఊహాగానాలు చేయవద్దని, తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని ఆమె ప్రజలను కోరారు.
ఆకృతి ఇన్‌స్టా పోస్టు ప్రకారం.. “బాధాకరమైన హృదయంతో ఒక విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నాకు కాబోయే భర్త, నేను మా భవిష్యత్తుకు సంబంధించిన లక్ష్యాలు, పరిస్థితులు వేర్వేరుగా ఉండటంతో విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మేము ఒకరిపట్ల ఒకరం ఎంతగానో ప్రేమతో ఉన్నాం. ప్రస్తుతం మేము ఎదుర్కొంటున్న బాధ్యతలు, పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పరస్పర అంగీకారంతో వేర్వేరు మార్గాల్లో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం అని అకృతి ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు.
“మేమిద్దరం ముందుకు సాగుతున్న సమయంలో మా ఇద్దరికీ మంచి జరగాలని, ప్రశాంతత, సంతోషం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ క్లిష్ట సమయంలో మా వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని, మా నిర్ణయానికి గల కారణాలపై ఊహాగానాలు చేయడం లేదంటే అపార్ధం చేసుకోవడం మానుకోవాలని ప్రతి ఒక్కరినీ వినయపూర్వకంగా కోరుతున్నాను.” అని ఆమె పేర్కొన్నారు. అయితే, పృథ్వీ షా మాత్రం ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
పృథ్వీ షా, అకృతి అగర్వాల్ మార్చి 8న తమ నిశ్చితార్థాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా పృథ్వీ షా రొమాంటిక్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఓ ఫొటోలో అకృతికి షా మోకాళ్లపై కూర్చొని ప్రపోజ్ చేస్తున్నట్లు కనిపించగా.. మరో ఫొటోలో ఇద్దరూ తమ ఎంగేజ్‌మెంట్ ఉంగరాలను చూపించారు.
ఇదిలాఉంటే.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా పాపులర్ అయిన ఆకృతి.. ఈ ఏడాది విడుదలైన ‘త్రిముఖ’ సినిమాలో నటించింది.
