PSL 2026 : నాసిరకంగా హైదరాబాద్ జెర్సీ.. మ్యాచ్ మధ్యలో తెలుపు బంతి కాస్త గులాబి రంగులోకి.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు..
పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026 (PSL 2026) గురువారం లాహోర్‌లోని గద్దాఫీ స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా ప్రారంభమైంది.
- Thota Vamshi Kumar
- Updated on- March 27, 2026 / 11:07 AM IST
PSL 2026 1st Match Turns Into Pink Ball Contest Jersey Quality Questioned
- పీఎస్ఎల్ తొలి మ్యాచ్‌లో అనూహ్య ఘటన
- తెలుపు బంతి కాస్త పింక్ కలర్‌లోకి
- గంగలో కలిసిన పాకిస్థాన్ క్రికెట్ పరువు
PSL 2026 : పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026 గురువారం లాహోర్‌లోని గద్దాఫీ స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా ప్రారంభమైంది. షహీన్ అఫ్రిది సారథ్యంలోని లాహోర్ ఖలందర్స్ జట్టు మార్నస్ లాబుషేన్ సారథ్యంలోని హైదరాబాద్ కింగ్స్‌మెన్‌ను 69 పరుగుల తేడాతో ఓడించింది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలందర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఖలందర్స్ బ్యాటర్లలో ఫఖర్ జమాన్ (53) హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం 200 పరుగుల లక్ష్య ఛేదనలో 130 పరుగులకే కుప్పకూలింది.
గులాబి రంగులోకి మారిన బాల్..
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ కింగ్స్‌మెన్ బౌలింగ్ చేస్తున్న సమయంలో తెలుపు బంతి ముందు పింక్ గా ఆ తరువాత ఎరుపు రంగులోకి మారిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ కింగ్స్‌మెన్ జెర్సీ వల్లనే ఇలా జరిగినట్లు తెలుస్తోంది.
ప్లేయర్లు బంతికి మెరుపు తెప్పించడం కోసం తమ జెర్సీలకు రుద్దడాన్ని చూస్తూనే ఉంటాం. ఇక హైదరాబాద్ ఆటగాళ్ల జెర్సీలు నాసిరకం కావడం వల్లే.. ఆ జెర్సీల రంగు బంతికి అంటుకుని ఉంటుందని అంటున్నారు. ఈ దెబ్బతో క్రికెట్ ప్రపంచంలో పాకిస్థాన్ క్రికెట్ పరువు మరోసారి పోయింది.
స్పందించిన హైదరాబాద్ కెప్టెన్ లబుషేన్..
మ్యాచ్ మధ్యలో బంతి గులాబి రంగులోకి మారిపోవడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఇక ఇదే విషయాన్ని హైదరాబాద్ కెప్టెన్ మార్నస్ లబుషేన్ అంపైర్‌కు సైతం ఫిర్యాదు చేశాడు. ఇక మ్యాచ్ అనంతరం లబుషేన్ మాట్లాడుతూ.. ‘రెండో ఓవర్ తరువాత నేను అంపైర్‌తో ఈ విషయం గురించి మాట్లాడాను. జెర్సీల వల్లే ఇలా జరిగి ఉంటుంది. గతంలో ఇలాంటివి నేను ఎన్నడూ చూడలేదు.’ అంటూ లబుషేన్ చెప్పుకొచ్చాడు.
బ్యాట్ రంగు బంతికి అంటుకోవడం లేదంటే ప్యాడ్‌కు తగిలి దానిపై ఉన్న రంగు ఊడిపోవడం వంటి సందర్భాలను చూసాను కానీ.. ఇలాంటిది చూడలేదని లబుషేన్ తెలిపాడు. ఇక తదుపరి మ్యాచ్‌ల్లో వారు దీన్ని సరిచేస్తారని భావిస్తున్నట్లు తెలిపాడు.
