Rinku Singh : కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో రింకూ సింగ్‌పై ప్రశ్న.. సమాధానం చెబితే 6 లక్షల 40 వేలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరుపున సిక్సర్ల వర్షం కురిపించాడు రింకూ సింగ్. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షోలో రింకూ సింగ్‌కు సంబంధించిన ఓ ప్రశ్నను అడిగారు.
- Thota Vamshi Kumar
- Published on- August 19, 2023 / 03:41 PM IST
KBC Question
Rinku Singh- KBC : ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)2023 లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight Riders)తరుపున సిక్సర్ల వర్షం కురిపించాడు రింకూ సింగ్(Rinku Singh). లీగ్ దశలో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో చివరి ఐదు బంతులను సిక్సర్లుగా బాది కేకేఆర్‌కు అద్వితీయ విజయాన్ని అందించాడు. ఆ తరువాత కూడా పరుగుల వరద పారించడంతో ఆసియా క్రీడలతో పాటు ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక అయ్యాడు.
డబ్లిన్ వేదికగా శుక్రవారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ టీ20ల్లో అరంగ్రేటం చేశాడు రింకూ సింగ్. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో డక్త్‌వర్త్ లూయిస్ పద్దతిలో భారత జట్టు విజయం సాధించింది. కాగా.. ఈ మ్యాచ్‌లో రింకూ సింగ్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.
ఇదిలా ఉంటే.. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షోలో రింకూ సింగ్‌కు సంబంధించిన ఓ ప్రశ్నను అడిగారు. తాజాగా ఓ ప్రొమోను విడుదల చేశారు. అందులో ‘ఘూమర్’ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ యూనిట్ కేబీసీలో పాల్గొంది. అభిషేక్ బచ్చన్, సయామీ ఖెర్, దర్శకుడు ఈ షోలో పాల్గొన్నారు. హోస్ట్ అమితాబ్ బచ్చన్ వారిని ఓ ప్రశ్న అడిగాడు. ఐపీఎల్ 2023 సీజన్లో చివరి ఓవర్లో వరుసగా ఐదు సిక్సర్లు కొట్టిన కోల్‌కతా బ్యాటర్ ఎవరు అనే ప్రశ్నను సంధించారు. ఆండ్రూ రస్సెల్, నితీశ్ రాణా, రింకూ సింగ్, వెంకటేశ్ అయ్యర్ ఇలా నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. దీనికి సమాధానం చెబితే రూ.6.40 లక్షలు సొంతం అవుతాయి.
ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలుసా కదా..? ఎవరో కాదు రింకూ సింగ్. దీనికి అభిషేక్ బచ్చన్ టీమ్ సరిగ్గా సమాధానం చెప్పిందో లేదో తెలియాలంటే ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.
