Riyan Parag : ఆర్‌సీబీపై విజయం.. రియాన్ పరాగ్ హాట్ కామెంట్స్.. కొన్ని తప్పులు నిర్ణయాలు తీసుకున్నాను..
మ్యాచ్‌లో విజయం సాధించడం ఆనందాన్ని ఇచ్చిందని అదే సమయంలో తమ బౌలింగ్ విభాగం మెరుగుపడాల్సి ఉందని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ (Riyan Parag) తెలిపాడు.
- Thota Vamshi Kumar
- Published On : April 11, 2026 / 07:57 AM IST
Riyan Parag comments after Rajasthan Royals beat RCB in IPL 2026
- ఆర్‌సీబీ పై ఆర్ఆర్ విజయం
- రియాన్ పరాగ్ హాట్ కామెంట్స్
Riyan Parag : ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ విజయపరంపరను కొనసాగిస్తోంది. వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. శుక్రవారం గౌహతి వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఆర్ఆర్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ఆనందాన్ని ఇచ్చిందని అదే సమయంలో తమ బౌలింగ్ విభాగం మెరుగుపడాల్సి ఉందని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ తెలిపాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఆర్‌సీబీ బ్యాటర్లలో రజత్ పాటిదార్ (63; 40 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు) హాప్ సెంచరీ చేశాడు. విరాట్ కోహ్లీ (32; 16 బంతుల్లో 7 ఫోర్లు), వెంకటేశ్ అయ్యర్ (29 నాటౌట్; 15 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) లు రాణించారు. ఆర్ఆర్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మలు తలా రెండు వికెట్లు పడగొట్టారు. సందీప్ శర్మ, రవీంద్ర జడేజాలు చెరో వికెట్ సాధించారు.
అనంతరం 202 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ 18 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. వైభవ్ సూర్యవంశీ (78; 26 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు), ధ్రువ్ జురెల్ (81 నాటౌట్; 43 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర హాఫ్ సెంచరీలు చేశారు. బెంగళూరు బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్, కృనాల్ పాండ్యా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
బౌలింగ్ విభాగం ఇంకాస్త మెరుగుపడాలి
మ్యాచ్ అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై విజయం సాధించడం పట్ల రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. గత కొన్నేళ్లుగా ఈ వేదికపై తమకు గొప్ప రికార్డు లేదన్నాడు. అయినప్పటికి కూడా ఈ రోజు ఆడిన తీరు చాలా బాగుందన్నాడు. అయితే.. తమ బౌలింగ్ విభాగం ఇంకాస్త మెరుగుపడాల్సి ఉందన్నాడు. ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన తీరు చూస్తే వాళ్లు ఈజీగా 200 పరుగులు చేస్తారని అనుకున్నాను. కానీ మధ్యలో తమ బౌలర్లు పుంజుకున్న తీరు నిజంగా అద్భుతం అని చెప్పుకొచ్చాడు. ఆ లెక్కన వారిని 170 పరుగుల లోపే కట్టడి చేయాల్సి ఉందన్నాడు. ఈ విషయంలో బౌలర్లు ఇంకాస్త మెరుగుపడాల్సి ఉందన్నాడు. ఇక కెప్టెన్‌గా తాను కొన్ని తప్పులు నిర్ణయాలు తీసుకున్నాను అని పరాగ్ అన్నాడు.
అతడే మా కొంపముంచాడు.. ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ కీలక వ్యాఖ్యలు..
ఈ మ్యాచ్‌లో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటామన్నాడు. మరోసారి వాటిని పునరావృతం చేయకుండా ఉండేందుకు ప్రయత్నిస్తామని చెప్పుకొచ్చాడు. పరిస్థితులకు అనుగుణంగా మారడమే ఓ జట్టుగా తమ లక్ష్యం అని తెలిపాడు. ఇప్పటి వరకు తాము బ్యాటింగ్‌కు కాస్త కష్టమైన పిచ్‌లపైనే ఆడామని, ఒక్కసారి బ్యాటింగ్ పిచ్ దొరికితే మాత్రం ఇంకా అద్భుతమైన ఆట ఆడతామన్నాడు.
ఇక వైభవ్ సూర్యవంశీ పై ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు జట్టులో అందరికి ఇష్టమైన ఆటగాడు అని చెప్పుకొచ్చాడు. అతడికి బయట తిరగడం, రకరకాల ఆహార పదార్థాలు తినడం అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చాడు. అందుకనే అతడికి కావాల్సిన అన్నింటిని తాము ఏర్పాటు చేశామన్నాడు. అంతేకాదు అతడికి బ్యాటింగ్ అంటే చాలా పిచ్చి ప్రేమ అని పరాగ్ చెప్పాడు.
