Rohit Sharma : రిటైర్మెంట్పై రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆటకు వీడ్కోలు ఎప్పుడంటే..?
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) కెరీర్ చివరి దశకు వచ్చేసింది అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు అతడి వయసు 36 సంవత్సరాలు. ఇంకెంత కాలం క్రికెట్ ఆడతాడో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి.
- Thota Vamshi Kumar
- Updated on- August 6, 2023 / 08:41 PM IST
Rohit Sharma on Retirement
Rohit Sharma on Retirement : భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) కెరీర్ చివరి దశకు వచ్చేసింది అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు అతడి వయసు 36 సంవత్సరాలు. ఇంకెంత కాలం క్రికెట్ ఆడతాడో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. భారత్ వేదికగా జరగనున్న ప్రపంచకపే రోహిత్ శర్మకు ఆఖరిది అని ఇటీవల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మెగా టోర్నీ అనంతరం రోహిత్ ఆటకు వీడ్కోలు పలుకుతాడు అనే ప్రచారం జరుగుతోంది. అయితే.. తాజాగా హిట్‌మ్యాన్ రోహిత్ తన రిటైర్మెంట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
టీమ్ఇండియా ప్రస్తుతం వెస్టిండీస్ జట్టుతో టీ20 సిరీస్ ఆడుతోంది. అయితే.. టీ20 సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు అయిన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు విశ్రాంతి ఇచ్చారు. ఈ క్రమంలో అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమానికి రోహిత్ శర్మ హాజరు అయ్యాడు. అక్కడ తన రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చాడు. ‘ఇక్కడకు రావడానికి ఓ కారణం ఉంది. వచ్చే ఏడాది జూన్‌లో ఇక్కడే టీ20 ప్రపంచకప్ జరగనుందనే విషయం అందరికి తెలిసిందే. ఆ మెగా టోర్నీ కోసం మీతో పాటు నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. నాకు కూడా ఆ టోర్నీలో బరిలోకి దిగాలని ఉంది.’ అని రోహిత్ శర్మ అన్నాడు.
దీంతో వచ్చే ఏడాది వెస్టిండీస్-అమెరికాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న టీ20 ప్రపంచకప్ 2024లో కూడా రోహిత్ ఆడతాడని అతడి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గతేడాది టీ20 ప్రపంచకప్ తరువాత పొట్టి ఫార్మాట్లో టీమ్ఇండియా తరుపున రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి లు ఆడని సంగతి తెలిసిందే. వీరిద్దరు ఈ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనప్పటికీ సెలక్టర్లు ఈ ఇద్దరిని ఎంపిక చేయడం లేదు. యువ ఆటగాళ్లకు అవకాశం ఇస్తున్నారు. టీ20లకు హార్దిక్ పాండ్య సారథ్యం వహిస్తున్నాడు. ప్రస్తుత వెస్టిండీస్ పర్యటనలోని టీ20 సిరీస్‌కు సెలక్టర్లు.. విరాట్, రోహిత్ శర్మలను ఎంపిక చేయని సంగతి తెలిసిందే. ఇక వీరి టీ20 కెరీర్ ముగిసిందని పలువురు క్రికెట్ పండితులు చెబుతుండగా రోహిత్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
