Scotland fans : ఫిఫా ప్రపంచకప్ తెచ్చిన తంటా.. బీర్లు నో స్టాక్.. 10 వేల మంది కలిసి..
స్కాట్లాండ్ అభిమానుల దెబ్బకు బోస్టన్ నగరంలో బీర్ల (Scotland fans) కొరత ఏర్పడింది.
- Thota Vamshi Kumar
- Updated on- June 19, 2026 / 02:56 PM IST
Scotland fans cause beer crisis in Boston
Scotland fans : ప్రపంచం అంతా ప్రస్తుతం ఫుట్‌బాల్ ఫీవర్ నడుస్తోంది. అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఫిఫా ప్రపంచకప్ 2026లో మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. గోల్స్ వర్షంలో ఫ్యాన్స్ తడిసి ముద్దాడుతున్నారు. ఇక దాదాపు మూడు దశాబ్దాల తరువాత స్కాట్లాండ్ ఫుట్‌బాల్ జట్టు ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. దీంతో తమ జట్టు ఆడే మ్యాచ్‌లను స్వయంగా చూడాలని ఆ దేశానికి చెందిన వేలాది మంది అభిమానులు అమెరికాలోని బోస్టన్ నగరానికి వచ్చారు. వీరిని టార్టన్ ఆర్మీగా పిలుస్తారు.
ఈ ప్రపంచకప్‌లో స్కాట్లాండ్ జట్టు తాము ఆడిన తొలి మ్యాచ్‌లో హైతీ పై 1-0 తేడాతో విజయం సాధించింది. దీంతో టార్టన్ ఆర్మీ సంబరాలకు అంతేలేకుండా పోయింది. బోస్టన్ నగరంలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. తమ జట్టు విజయం సాధించడంతో వేడుకలు జరుపుకునేందుకు బోస్టన్ నగరంలోని బార్లకు పరుగులు తీశారు.
దీంతో బోస్టన్‌లోని పలు పబ్‌లు, బార్లు, మద్యం దుకాణాల్లో బీర్ల అమ్మకాలు అమాంతం పెరిగాయి. ప్రముఖ శామ్యూయెల్ అడమ్స్ ట్యాప్‌రూమ్‌లో సాధారణంగా నాలుగు రోజుల సెలవు కాలంలో అమ్ముడయ్యే బీర్ కంటే నాలుగు రెట్లు ఎక్కువగా విక్రయాలు జరిగాయి. దీంతో అక్కడి నిల్వలు పూర్తిగా ఖాళీ కావడంతో అత్యవసరంగా కొత్త సరఫరాలను తెప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
The Scotland fans are not letting the rain in Boston stop the party ! pic.twitter.com/ZqSXls8gmb
— LIMBZ (@LimbzHQ) June 19, 2026
తమ వ్యాపార చరిత్రలో ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని బోస్టన్‌లోని పలువురు బార్ యజమానులు పేర్కొన్నారు అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా అత్యధిక రద్దీ ఉండే సెయింట్ ప్యాట్రిక్స్ డే కంటే కూడా ఈసారి అమ్మకాలు రెండు నుంచి మూడు రెట్లు పెరిగినట్లు తెలిపారు. బీర్‌తో పాటు ఇతర పానీయాల విక్రయాలు కూడా భారీగా పెరగడంతో సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పెరిగింది.
బోస్టన్ బీర్ కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం.. నాలుగు రోజుల్లో 4000 పైంట్‌లకు పైగా బోస్టన్ లాగర్ అమ్ముడయ్యింది, ఫలితంగా దాదాపు 90 కెగ్‌లు ఖాళీ అయ్యాయి. ఒకానొక దశలో డిమాండ్‌ను తట్టుకోవడానికి కంపెనీ అనేక అత్యవసర డెలివరీలను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇక కొన్ని చోట్ల పలు ప్రఖుఖ బ్రాండ్ల బీర్లు అందుబాటులో లేవని నో స్టాక్ బోర్డులు పెట్టాల్సి వచ్చిందట.
Shreyanka Patil : మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియాకు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ ఔట్..
ఇదిలా ఉంటే.. స్థానిక వ్యాపారులు స్కాట్లాండ్ అభిమానుల ఉత్సాహాన్ని ప్రశంసిస్తున్నారు. వారు మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తూ.. స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తున్నారని తెలిపారు. ఇక శనివారం స్కాట్లాండ్ జట్లు మొరాకోతో ఆడనుంది. ఈ క్రమంలో మరింత మంది ఫ్యాన్స్ బోస్టన్‌ను చేరుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో బార్లు, మద్యం దుకాణాలు భారీ స్థాయిలో బీర్ల నిల్వలను సిద్ధం చేసుకుంటున్నాయని తెలుస్తోంది.
