Hardik Pandya : హార్దిక్ పాండ్యా ఇదేం కెప్టెన్సీ.. ఇంపాక్ట్ ప్లేయర్‌ను ఎందుకు తీసుకున్నావ్.. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ఇలా..
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya )ఇంపాక్ట్ ప్లేయర్‌గా శార్దూల్ ఠాకూర్‌ను బరిలోకి దింపాడు.
- Thota Vamshi Kumar
- Updated on- April 30, 2026 / 09:24 AM IST
Shardul Thakur becomes the first impact player in IPL history who neither batted nor bowled (pic credit@ipl)
- సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా శార్దూల్‌ను బరిలోకి దించిన పాండ్యా
- కనీసం ఒక్క బంతి కూడా వేయించలే
- హార్దిక్ కెప్టెన్సీ పై విమర్శలు
Hardik Pandya : ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను 2023లో తీసుకువచ్చారు. అప్పటి నుంచి ప్రతి జట్టు కూడా తమ అవసరాలకు అనుగుణంగా ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను ఉపయోగించుకుని మంచి ఫలితాలను సాధిస్తున్నాయి.
ఆరంభంలో వికెట్లు కోల్పోతే బ్యాటర్లను.. ప్రత్యర్థి భారీగా పరుగులు సాధిస్తుంటే బౌలర్‌ను ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడిస్తూ మ్యాచ్‌లలో లబ్దిపొందడాన్ని చూస్తూనే ఉన్నాం. అయితే.. బుధవారం ముంబైలోని వాంఖడే వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ ర్యాన్ రికెల్టన్ (123; 55 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్లు) శతక్కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది. విల్ జాక్స్ (46; 22 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (31; 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో ప్రఫుల్ హింజ్ రెండు, మలింగ, సాకిబ్ హుస్సేన్, నితీశ్ కుమార్ రెడ్డి లు తలా ఓ వికెట్ తీశారు.
అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 244 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగింది. సన్‌రైజర్స్ ఓపెనర్లు ముంబై బౌలర్ల పై ఎదురుదాడికి దిగారు. కేవలం 7 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా 115 పరుగులు రాబట్టారు. ఈ దశలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇంపాక్ట్ ప్లేయర్‌గా శార్దూల్ ఠాకూర్‌ను బరిలోకి దింపాడు.
ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది గానీ, అతడితో కనీసం ఒక్క ఓవర్ కూడా వేయించలేదు. పోనీ మిగిలిన బౌలర్లు ఏమన్నా వికెట్లు తీస్తున్నారు ? మ్యాచ్‌లో ముంబై విజయం సాధించేటట్లుగా ఉందా అంటే అదీ లేదు. శార్దూల్ ఠాకూర్‌తో కనీసం ఒక ఓవర్ వేయించి చూస్తే బాగుండేన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కాగా.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఓ ఆటగాడిని తీసుకుని బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేయించకుండా ఉండడం ఐపీఎల్ చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం గమనార్హం. హార్దిక్ నిర్ణయం పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ముంబై అభిమానులు అతడి కెప్టెన్సీని ప్రశ్నిస్తున్నారు. ఒక్క బంతి కూడా వేయించకుండా ఇంపాక్ట్ ప్లేయర్‌గా శార్దూల్ ను తీసుకోవడం వెనుక కారణం ఏంటో పాండ్యాకే తెలియాలని సెటైర్లు వేస్తున్నారు.
ఇక ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది.
