Shreyas Iyer : ఆ ఒక్క తప్పు వల్లే ఓడిపోయాం.. లేదంటేనా.. టీమ్ఇండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్..
నాలుగో టీ20 మ్యాచ్ అనంతరం ఓటమిపై టీమ్ఇండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు
- Thota Vamshi Kumar
- Updated on- July 10, 2026 / 07:02 AM IST
Shreyas Iyer comments after team india lost match against england in 4th T20
Shreyas Iyer : బ్రిస్టల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్ పరాజయం పాలైంది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లాండ్ కైవసం చేసుకుంది. గత ఆరు మ్యాచ్‌ల్లో భారత్‌కు ఇది ఐదో ఓటమి కావడం గమనార్హం. బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమికి కారణం అని టీమ్ఇండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. టీమ్ఇండియా బ్యాటర్లలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (80 నాటౌట్; 49 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీ బాదాడు. శివమ్ దూబె (22) పర్వాలేదనిపించాడు. వైభవ్ సూర్యవంశీ (15), అభిషేక్ శర్మ (16), ఇషాన్ కిషన్ (4), తిలక్ వర్మ(11) లు ఘోరంగా విఫలం అయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్‌లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. విల్ జాక్స్, ఆదిల్ రషీద్ తలా ఓ వికెట్ సాధించారు.
అనంతరం 159 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 13.5 ఓవర్లలో వికెట్ కోల్పోయి చేదించింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో కెప్టెన్ హ్యారీ బ్రూక్ (79 నాటౌట్; 35 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు), ఫిల్ సాల్ట్ (59 నాటౌట్ 42 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలు చేశారు. ఇంగ్లాండ్ కోల్పోయిన ఏకైక వికెట్ ను అర్ష్‌దీప్ సింగ్ పడగొట్టాడు.
జట్టు పరివర్తన దశలో ఉంది
మ్యాచ్ అనంతరం ఓటమిపై టీమ్ఇండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీవ్ర నిరాశను వ్యక్తం చేశాడు. ఈ పిచ్ పై 158 పరుగుల లక్ష్యం ఏ మాత్రం సరిపోదన్నాడు. ఇంగ్లాండ్ ఎంత వేగంగా లక్ష్యాన్ని ఛేదించిందో అందరూ చూశాం. ఇది మరోసారి నిరాశ కలిగించిన ఫలితం అని చెప్పుకొచ్చాడు. బ్యాటింగ్ వైఫల్యమే తమ కొంపముంచిందన్నాడు.
ఇక బౌలర్ల ప్రదర్శనపై మాట్లాడుతూ.. తక్కువ స్కోరు ఉన్నప్పటికీ నిర్దిష్ట ప్రణాళికతో బౌలింగ్ చేయాలని సూచించామని తెలిపారు. ఒకే లెంగ్త్‌లో బంతులు వేయాలని బౌలర్లకు సూచించామన్నాడు. కానీ మైదానంలో ఆ ప్రణాళికను సరిగా అమలు చేయలేకపోయామని తెలిపాడు. మిడిల్, లెగ్ స్టంప్‌లపై బంతులు వేస్తే బౌండరీలు కొట్టడం కష్టమని భావించామని, కానీ వేగంలో మార్పులు చేస్తూ వేసిన బంతులను ఇంగ్లాండ్ బ్యాటర్లు సద్వినియోగం చేసుకుని పరుగులు సాధించారని అన్నాడు.
ఇక ఈ సిరీస్‌లో వ్యక్తిగతంగా మంచి బ్యాటింగ్ చేసినప్పటికీ, జట్టు గెలవకపోతే తన ప్రదర్శనకు విలువ లేదని అయ్యర్ స్పష్టం చేశారు. ‘నా వ్యక్తిగత ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నా.. అది జట్టుకు విజయం అందించకపోతే ఆనందం ఉండదు. నేను ఎప్పుడూ జట్టు గెలవాలని కోరుకుంటాను. ఈరోజు అది సాధ్యపడలేదు.’ అని అన్నాడు.
జట్టు ప్రస్తుతం పరివర్తన దశలో ఉందన్నాడు. యువ ఆటగాళ్లు తొలిసారి విదేశీ పరిస్థితుల్లో ఆడుతున్నందున తప్పిదాలు సహజం అని అయ్యర్ తెలిపాడు. అయితే.. వాటి నుంచి ఆటగాళ్లు చాలా త్వరగా పాఠాలు నేర్చుకుని మరింత బలంగా తిరిగి రావాలన్నాడు. సిరీస్ కోల్పోయినా చివరి మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేసి సానుకూల ముగింపు ఇవ్వడమే ఇప్పుడు మా లక్ష్యం అని శ్రేయాస్ అయ్యర్ చెప్పాడు.
