Shubman Gill : ఇదేం వింత సామీ.. గెలిచినా కూడా సంతోషంగా లేవా.. శుభ్‌మ‌న్ గిల్ ఆస‌క్తిక‌ర కామెంట్స్‌..

కేకేఆర్ పై విజ‌యం సాధించ‌డం ప‌ట్ల ఆనందాన్ని వ్య‌క్తం చేసిన శుభ్‌మ‌న్ గిల్ (Shubman Gill)మ్యాచ్‌ను తాను ముగించ‌లేక‌పోయినందుకు నిరాశ‌ను వ్య‌క్తం చేశాడు

Shubman Gill key comments after Gujarat Titans beat Kolkata Knight Riders in IPL 2026

  • కేకేఆర్ పై విజ‌యం సాధించిన గుజ‌రాత్ టైటాన్స్‌
  • ఈ సీజ‌న్‌లో జీటీకి వ‌రుస‌గా ఇది మూడో గెలుపు
  • ఆనందాన్ని వ్య‌క్తం చేసిన గిల్‌
  • అదే స‌మ‌యంలో మ్యాచ్‌ను తాను ముగించ‌క‌పోవ‌డం ప‌ట్ల నిరాశ

Shubman Gill : ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన గుజ‌రాత్ టైటాన్స్ ఆ త‌రువాత వ‌రుస విజ‌యాల‌తో అల‌రిస్తోంది. శుక్ర‌వారం అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. ఈ సీజ‌న్‌లో గుజ‌రాత్‌కు వ‌రుస‌గా ఇది మూడో విజ‌యం కావ‌డం విశేషం. ఈ విజ‌యం ఎంతో సంతోషాన్ని ఇచ్చిన‌ప్ప‌టికి కూడా తాను మ్యాచ్‌ను ముగించ‌లేక‌పోయినందుకు గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ కాస్త అసంతృప్తిని వ్య‌క్తం చేశాడు.

కామెరూన్ గ్రీన్ (79; 55 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ చేయ‌డంతో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 180 ప‌రుగుల‌కు ఆలౌటైంది. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో క‌గిసో ర‌బాడ మూడు వికెట్లు తీశాడు. సిరాజ్, అశోక్ శ‌ర్మ‌లు చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. ప్ర‌సిద్ధ్ కృష్ణ‌, ర‌షీద్ ఖాన్‌లు త‌లా ఓ వికెట్ సాధించారు.

అనంత‌రం శుభ్‌మ‌న్ గిల్ (86; 50 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స‌ర్ల) మెరుపు హాఫ్ సెంచ‌రీ చేయ‌డంతో 181 ప‌రుగుల ల‌క్ష్యాన్ని గుజ‌రాత్ టైటాన్స్ 19.4 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి అందుకుంది. కేకేఆర్ బౌల‌ర్ల‌లో వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి రెండు వికెట్లు తీశాడు. వైభ‌వ్ అరోరా, సునీల్ న‌రైన్, ర‌మ‌ణ్‌దీప్ సింగ్ లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

మ్యాచ్ అనంత‌రం గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ మాట్లాడుతూ.. ఈ విజ‌యం ఎంతో ఆనందాన్ని ఇచ్చింద‌న్నాడు. వ్య‌క్తిగ‌త మైలురాళ్ల లేదా ఆరెంజ్ క్యాప్ క‌న్నా త‌న‌కు జ‌ట్టు విజ‌యాలే అత్యంత ప్రాధాన్యం అని స్ప‌ష్టం చేశాడు. జ‌ట్టును ఫైన‌ల్‌కు చేర్చి క‌ప్పును కైవ‌సం చేసుకోవ‌డ‌మే త‌న అస‌లైన ల‌క్ష్యం అని చెప్పుకొచ్చాడు.

అలా చేసి ఉంటే ఇంకా బాగుండేది

ఇక వ్య‌క్తిగ‌తంగా 86 ప‌రుగుల ఇన్నింగ్స్‌తో రాణించిన‌ప్ప‌టికి కూడా గిల్ కొంత అసంతృప్తిని వ్య‌క్తం చేశాడు. తాను గెలుపు లాంఛ‌నాన్ని పూర్తి చేయాల‌ని భావించిన‌ట్లుగా తెలిపాడు. తాను చివ‌రి ఓవ‌ర్ వ‌ర‌కు క్రీజులో ఉండి ఉంటే మ్యాచ్ మ‌రో రెండు ఓవ‌ర్ల ముందే గెలిచి ఉండేద‌ని త‌ద్వారా నెట్‌ర‌న్‌రేటు మ‌రింత మెరుగు అయ్యేద‌ని అన్నాడు. త‌దుప‌రి మ్యాచ్‌ల్లో ఇలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌కుండా చూసుకుంటాన‌ని చెప్పుకొచ్చాడు.

ALSO READ : ఎంత ప‌ని చేశావ్ గ్రీన్‌.. కొత్త కారుకు సొట్ట పెట్టావుగా.. అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన టాటా..

గుజ‌రాత్ బౌల‌ర్ల పై గిల్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. సిరాజ్‌, ర‌బాడ అద్భుతంగా బౌలింగ్ చేశార‌న్నాడు. ప్ర‌తి బంతికి వారు వికెట్ తీసేలా క‌నిపించార‌ని చెప్పుకొచ్చాడు. అందుక‌నే ఎండ‌ అధికంగా ఉన్న‌ప్ప‌టికి కూడా వారిద్ద‌రి చేత వ‌రుస‌గా మూడు ఓవ‌ర్లు వేయించాన‌ని అన్నాడు. కేకేఆర్ బ్యాటింగ్ డెప్త్ గురించి ప‌ట్టించుకోలేద‌ని, వికెట్లు తీయాల‌నే పాజిటివ్ మైండ్ సెట్‌తో ఆడిన‌ట్లుగా వివ‌రించాడు. మ‌ధ్య ఓవ‌ర్ల‌లో కేకేఆర్ పుంజుకున్న‌ప్ప‌టికి కూడా త‌మ బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ప్ర‌త్య‌ర్థి భారీ స్కోరు సాధించ‌కుండా నిలువ‌రించార‌ని అన్నాడు.

ఆట నుంచి విరామం ల‌భించిన స‌మ‌యంలో త‌న ఫిట్‌నెస్‌తో మాన‌సిక దృఢ‌త్వంపై ప‌ని చేసిన‌ట్లుగా తెలిపాడు. గ‌తంలో జ‌రిగిన పొర‌పాట్ల గురించి ఎక్కువ‌గా చింతించ‌డం లేద‌ని, భ‌విష్య‌త్తు గురించి ఎక్కువ‌గా ఆలోచించ‌డం లేద‌ని, వ‌ర్త‌మానంలోనే ఉంటున్నాన‌ని అన్నాడు. ఈ విష‌య‌మే త‌న బ్యాటింగ్‌లో ఎంతో మార్పు తీసుకువ‌చ్చింద‌ని గిల్ అన్నాడు.