Shubman Gill : వెస్టిండీస్‌పై తొలి వన్డేలో విజయం.. టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు..
తొలి వన్డేలో వెస్టిండీస్ పై విజయం సాధించడంపై టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill)స్పందించాడు.
- Thota Vamshi Kumar
- Updated on- September 28, 2026 / 08:18 AM IST
Shubman Gill key comments after Team India beat West Indies in 1st ODI
Shubman Gill : తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకుపోయింది.
తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. జస్టిన్ గ్రీవ్స్ (101; 108 బంతుల్లో 12 ఫోర్లు) సెంచరీతో చేశాడు. జాన్ క్యాంప్‌బెల్ (62), అమీర్ జంగూ (58 నాటౌట్) హాఫ్ సెంచరీలు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీశాడు. ప్రసిద్ద్ కృష్ణ రెండు, నితీశ్ కుమార్ రెడ్డి ఓ వికెట్ సాధించాడు.
అనంతరం విరాట్ కోహ్లీ (139 నాటౌట్; 88 బంతుల్లో 10 ఫోర్లు, 9 సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (110; 108 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్) లు శతకాలతో చెలరేగడంతో 296 పరుగుల లక్ష్యాన్ని భారత్ 41.4 ఓవర్లలో రెండు కోల్పోయి ఛేదించింది. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్, రోస్టన్ ఛేజ్ చెరో వికెట్ తీశారు.
ఇక మ్యాచ్ అనంతరం తమ జట్టు గెలుపుపై టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తన శతక ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ.. వాస్తవం చెప్పాలంటే తాను మ్యాచ్‌ను ముగించాల్సింది అని అనిపించిందని, చివరి వరకు క్రీజులో ఉండి ఉంటే బాగుండేదన్నాడు. ఇన్నింగ్స్ ఆఖరిలో ఔట్ అయినప్పటికి కూడా తనకు ఈ ఇన్నింగ్స్ ఎంతో సంతృప్తి ఇచ్చిందన్నాడు. ఇక ఇన్నింగ్స్ ఆరంభంలో ఆల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో వరుసగా కొట్టిన మూడు బౌండరీల్లో ఏదీ అత్యంత ఇష్టమైన షాట్ అని అడుగగా.. కవర్స్ మీదుగా ఆడిన ఫ్రంట్ ఫుట్ షాట్ అని గిల్ సమాధానం ఇచ్చాడు.
కుల్దీప్ పై ప్రశంసలు..
నాలుగు వికెట్లు తీసి మ్యాచ్ గమనాన్ని మార్చి వేసిన కుల్దీప్ యాదవ్ పై శుభ్‌మన్ గిల్ ప్రశంసల వర్షం కురిపించాడు. కుల్దీప్ యాదవ్ క్వాలిటీ స్పిన్నర్ అని చెప్పుకొచ్చాడు. మిడిల్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీస్తూ ఉండే ఆటగాడే.. కీలక ప్లేయర్‌గా మారుతాడు. ఈ విషయాన్ని కుల్దీప్ పదే పదే నిరూపించుకున్నాడని తెలిపాడు. విండీస్ ఓపెనర్లు తొలి వికెట్‌కు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారని ఆ సమయంలో వారు 340 నుంచి 350 పరుగులు చేస్తారని అనిపించిందన్నాడు. అయితే.. కుల్దీప్ మమ్మల్ని తిరిగి పోటీలోకి తీసుకువచ్చాడని, దీంతో వారిని 300 లోపే కట్టడి చేయగలిగామన్నాడు.
కోహ్లీ స్వేచ్ఛగా ఆడుతున్నాడు..
ప్రస్తుతం విరాట్ కోహ్లీ పూర్తి స్వేచ్ఛతో ఆటను ఎంతో ఆస్వాదిస్తూ బ్యాటింగ్ చేస్తున్నాడని గిల్ తెలిపాడు. అతని బ్యాటింగ్‌లో ఆ ప్రభావం కనిపిస్తోందన్నాడు. బౌండరీలు కొట్టే సత్తా కోహ్లీలో ఎప్పుడూ ఉందని, అయితే.. ఇప్పుడు పూర్తి స్థాయిలో దాన్ని ఉపయోగించుకుంటున్నాడని చెప్పుకొచ్చాడు. అతడు దేశం కోసం ఎన్నో మ్యాచ్‌లు గెలిపించాడని, అలాంటి ఆటగాళ్లు తాము కోరుకున్న విధంగా ఆడేందుకు స్వేచ్ఛ ఇవ్వాలన్నాడు. అతడు ఒంటి చేత్తో మ్యాచ్‌లను గెలిపించగలడు అని తెలిపాడు.
ప్రస్తుతం తమ దృష్టి అంతా జట్టులో 8వ స్థానం వరకు బ్యాటింగ్ ఆప్షన్ ఉండేలా ప్రయత్నిస్తున్నామని గిల్ తెలిపాడు. ఎనిమిదో స్థానంలో ఆడే ఆటగాడు కనీసం 25 నుంచి 30 పరుగులు చేసే సామర్థ్యం ఉండాలని అన్నాడు. 250 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి మంచి స్థితిలో ఉన్న ఎన్నో మ్యాచ్‌ల్లో తాము ఆశించిన స్కోరును సాధించలేకపోయామన్నాడు. అందుకే ఎనిమిదో స్థానం చాలా కీలక మన్నాడు. ఆ స్థానంలో ఏ ఆటగాడు సరిపోతాడో, టీమ్ కాంబినేషన్ ఎలా సెట్ అవుతుందో చూసేందుకు రకరకాల కాంబినేషన్లు పరిశీలిస్తున్నామని తెలిపాడు.
