మేం ఆస్ట్రేలియాని ఓడించామోచ్.. జింబాబ్వే కెప్టెన్ మాటల్లో ఆనందం.. వావ్..
టీ20 ప్రపంచకప్ 2026లో ఆస్ట్రేలియాపై (AUS vs ZIM) విజయం సాధించడం పట్ల జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
- Thota Vamshi Kumar
- Published On : February 13, 2026 / 05:54 PM IST
Sikandar Raza comments after Zimbabwe beat Australia in T20 World Cup 2026
AUS vs ZIM : టీ20 ప్రపంచకప్ 2026లో ఆస్ట్రేలియాపై జింబాబ్వే సంచలన విజయాన్ని సాధించింది. ఈ విజయంపై జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇప్పటికి తాను దీన్ని నమ్మలేకపోతున్నానని చెప్పుకొచ్చాడు. మ్యాచ్ అనంతరం రజా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.
‘నాకు ఎంతో గర్వంగా, సంతోషంగా ఉంది. మా జట్టు సంస్కృతి, వాతావరణం, ఐక్యత అద్భుతమైనవి. నా సోదరులతో కలిసి ఆడుతూ సాధిస్తున్నాను అనే భావన ఉంది. మేము బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 10 ఓవర్లలో 70 పరుగులు చేశాము. అప్పుడు మేము 190 పరుగులు చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకోలేదు. ఎందుకంటే శ్రీలంకలో అలా చేయడానికి ప్రయత్నిస్తే వికెట్లు కోల్పోతాము అనే విషయం మాకు తెలుసు. అప్పుడు 140 కే ఆలౌట్ అవుతాము. అందుకనే మేము అలా చేయలేదు. అప్పటికి బెన్నీ బాగానే ఆడుతున్నాడు. అందుకనే అతడిని చివరి వరకు క్రీజులో ఉండమని మాత్రమే చెప్పాము. ‘అని సికిందర్ రజా అన్నాడు.
ఇక తమ జట్టు ఫీల్డింగ్ అద్భుతంగా ఉందని, కొన్ని అద్భుత క్యాచ్‌లు అందుకున్నామని తెలిపాడు. ఇక తన గాయం గురించి మాట్లాడుతూ.. ఆందోళన చెందాల్సిన పని లేదన్నాడు. ఒకటి లేదా రెండు రోజుల్లో తాను పూర్తిగా కోలుకుంటానని చెప్పుకొచ్చాడు. అదే సమయంలో జట్టులో ప్రస్తుతం 13 మంది ఆటగాళ్లు మాత్రమే ఫిట్‌గా ఉన్నారన్నాడు. క్రీమర్ గాయంతో బాధపడుతున్నాడని తెలిపాడు. ఎల్లప్పుడూ 15 మంది ఆటగాళ్లు ఫిట్‌గా ఉండాల్సిన అవసరం ఉందని, కాబట్టి గాయపడిన ఆటగాళ్ల స్థానాలను జింబాబ్వే క్రికెట్ బోర్డు త్వరలోనే భర్తీ చేస్తుందని తాను భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఏదీఏమైనప్పటికి కూడా ఈ రోజు గెలుపుకు తాము అర్హులం అని చెప్పాడు. ప్రస్తుతం తమ దృష్టి తదుపరి మ్యాచ్‌పై మాత్రమే ఉందన్నాడు.
గాయపడిన సికిందర్ రజా..
బ్యాటింగ్‌లో అద్భుతంగా ఆడిన రజా.. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 9వ ఓవర్ సమయంలో గాయపడ్డాడు. ఈ ఓవర్‌ను వేసేందుకు సిద్ధమైన అతడు రన్నరప్ చేసే క్రమంలో ఉన్నట్లుండి కుప్పకూలాడు. అతడు కుడి కాలి పట్టుకుని నొప్పితో విలవిలలాడాడు. నొప్పి తీవ్రంగా ఉండడంతో అతడు మైదానాన్ని వీడాడు. మళ్లీ అతడు మైదానంలోకి రాలేదు. అతడు కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. జింబాబ్వే బ్యాటర్లలో బ్రియాన్ బెన్నెట్( 64 నాటౌట్ ; 56 బంతుల్లో 7 ఫోర్లు) అర్థశతకం చేశాడు. తడివానాషే మరుమాని (35), ర్యాన్ బర్ల్ (35), సికిందర్ రజా (13 బంతుల్లో 25 నాటౌట్) రాణించారు. ఆసీస్ బౌలర్లలో మార్కస్ స్టోయినిస్, కామెరూన్ గ్రీన్ చెరో వికెట్ తీశారు.
అనంతరం 170 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 19.3 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. దీంతో జింబాబ్వే 23 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆసీస్ బ్యాటర్లలో మాట్ రెన్షా (65; 44 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ చేశాడు. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబానీ నాలుగు వికెట్లు పడగొట్టాడు. బ్రాడ్ ఎవాన్స్ మూడు వికెట్లు తీశాడు. వెల్లింగ్టన్ మసకద్జా, ర్యాన్ బర్ల్ లు చెరో వికెట్ సాధించారు.
